Harish Rao: లండన్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు!
హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎ
- By Gopichand Published Date - 05:35 PM, Fri - 5 September 25

Harish Rao: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు (Harish Rao) ఇటీవల లండన్‌లో జరిగిన ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నారై (ప్రవాస భారతీయ) సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిపై హరీష్ రావు వ్యాఖ్యలు
హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ లండన్‌లోనే ప్రారంభమైందని, ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించడానికి యూకే ఎన్నారైలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నవారు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన అద్భుతాలను వివరించారు. ముఖ్యంగా ‘బంగాల్ ఆచరిస్తుంది- దేశం అనుసరిస్తుంది’ అనే నానుడి కేసీఆర్ పాలనలో ‘తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుంది’గా మారిందని అన్నారు. రాష్ట్రం సాధించిన కొన్ని విజయాలను ఆయన ఈ విధంగా ప్రస్తావించారు.
తలసరి ఆదాయం & విద్యుత్ వినియోగం: భారతదేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, ఇది గూగుల్‌లో శోధించినా తెలుస్తుందని చెప్పారు.
జీఎస్‌డీపీ వృద్ధి (GSDP Growth): జీఎస్‌డీపీ వృద్ధిలో తెలంగాణకు దగ్గరగా ఏ రాష్ట్రం లేదని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ: ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే గొప్ప కార్యక్రమంగా దీనిని అభివర్ణించారు. మ్యానిఫెస్టోలో లేకపోయినా ఈ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని ‘సర్దార్ కోచ్‌లాని’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అయినా దేశవ్యాప్తంగా ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.
24 గంటల విద్యుత్: తెలంగాణ ఏర్పాటుకు ముందు పవర్ హాలిడేస్ ఉండేవని, ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని చెప్పారు.
మిషన్ కాకతీయ: చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచడం ద్వారా వ్యవసాయానికి, తాగునీటికి మేలు జరిగిందని తెలిపారు. కేంద్రం కూడా ‘అమృత్ సరోవర్’ కార్యక్రమాన్ని ప్రారంభించి దీనిపై అధ్యయనం చేసిందని చెప్పారు.
Also Read: Trump : ‘భారత్‌కు దూరమయ్యాం’..ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రైతుబంధు: రైతులకు నేరుగా నగదు బదిలీ చేసిన ఏకైక పథకం రైతుబంధు అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందని చెప్పారు. దీనిని కాపీ చేసి కేంద్రం ‘పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.
గ్రీన్ కవర్: తెలంగాణ గ్రీన్ కవర్‌ను 7.7% పెంచి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, ఇది ఓట్లు తేదని తెలిసినా భవిష్యత్ తరాల కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు తమకు ఉద్యోగాలు ఇచ్చింది, ట్రాక్టర్లు సమకూర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేసుకున్నారని, కానీ ఇప్పుడు పాలు, నీళ్లు తెలిసాయని చెబుతున్నారని అన్నారు. మునుపటి ప్రభుత్వంతో పోల్చే అవకాశం లేకపోవడం వల్ల తాము తప్పు చేశామని వారు చెప్పారని తెలిపారు.
నిధుల దుర్వినియోగం & అవినీతి: ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై దృష్టి పెట్టకుండా గూగుల్ ప్రచారంపై ఎక్కువ దృష్టి పెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరంపై ఆరోపణలు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఖండించారు. కేవలం మూడు బ్యారేజీలలో ఒక బ్యారేజీలో మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని, రూ.300-400 కోట్లతో వాటిని రిపేర్ చేయవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు, 60% తెలంగాణకు తాగునీరు లభిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కూలిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్: ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘కాళేశ్వరం లేకపోయినా రికార్డ్ పంట పండింది’ అని చెప్పడంపై హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెక్ డ్యాం కూడా కట్టలేదని, పది సంవత్సరాల టీఆర్ఎస్ కృషి వల్లనే ఈ పంట పండిందని చెప్పారు. మల్లన్నసాగర్ కూలిపోతే మూసీకి నీళ్లు ఎలా తీసుకువెళ్తావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.