Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్‌కు షాక్..
- Author : Vamsi Chowdary Korata
Date : 10-06-2026 - 9:26 IST
Published By : Hashtagu Telugu Desk
రాజమహేంద్రవరంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. పేపర్ మిల్స్ పీఎఫ్‌నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్‌నకు సంబంధించి షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర పేపర్ మిల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. గతంలో ఈపీఎఫ్, ఎంపీ చట్టం-1952 సెక్షన్ 17(4) కింద ఏపీ పేపర్ మిల్స్‌కు ఇచ్చిన ఉద్యోగుల పీఎఫ్‌నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పీఎఫ్‌నకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ సంస్థ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అందుకే పీఎఫ్‌నకు సంబంధించిన మినహాయింపును రద్దు చేస్తున్నట్లు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పేపర్ మిల్స్ లిమిటెడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా, గతంలో ఇచ్చిన పీఎఫ్ మినహాయింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈపీఎఫ్, ఎంపీ చట్టం-1952 సెక్షన్ 17(4) కింద మినహాయింపు లభించిన సంస్థకు కొంత ఊరట ఉంటుంది. ఈ మేరకు ఉద్యోగుల నుంచి మినహాయించిన పీఎఫ్ వాటా, సంస్థ వాటాను కలిపి సొంతంగా పీఎఫ్ ట్రస్టును నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది.
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు పరిసరాల్లో కాలుష్య తీవ్రత ఉన్నట్లు తేలింది. వాస్తవానికి చట్టం ప్రకారం ఫ్యాక్టరీని మూసివేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల విషయాన్ని గమనించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో ఆ పరిశ్రమ తప్పులు సరిచేసుకునేందుకు మరొక అవకాశం ఇచ్చారు. ఆంధ్ర పేపర్ మిల్లు పర్యావరణ నిబంధనలు పాటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. వెంటనే లోపాలను సరిచేసుకోవాలన్నారు. ఆంధ్ర పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.
ఆంధ్ర పేపర్ మిల్లు దగ్గర సేకరించిన నీటి నమూనాలను పరీక్షిస్తే కీలక విషయాలు తెలిశాయి. అక్కడ నీళ్లలో సల్ఫైడ్, డివోబీ, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పరిమితి 30 mg/L లోపు ఉండాలి, కానీ 36 mg/L ఉంది. ఏకంగా 20 శాతం అధికంగా నమోదైంది. ఫ్యాక్టరీ వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్లే నీటిలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోయి చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడుతున్నాయని తెలుస్తోంది. ల్యాబ్ నివేదిక ప్రకారం ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న ఈ వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఈ నీటిని సరిగ్గా శుద్ధి చేయకుండా గృహ అవసరాలకు వాడటం మానవ ప్రాణాలకే అపాయమని నివేదిక హెచ్చరించింది. అందుకే షోకాజ్ నోటీసు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.