పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆదివారం (మార్చి 23, 2026) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు.
- Author : Gopichand
Date : 24-03-2026 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్న తరుణంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు తుర్కియే, ఈజిప్ట్, పాకిస్థాన్ ప్రతినిధులు వైట్ హౌస్ దూత స్టీవ్ విట్కాఫ్తో సమావేశమయ్యారని పలు నివేదికలు పేర్కొంటున్న సమయంలో పాకిస్థాన్ నుండి ఈ ప్రకటన రావడం గమనార్హం.
చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్
అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ.. “ఇరాన్, ఇజ్రాయెల్ కోరుకుంటే చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇస్లామాబాద్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి నిరంతర సంభాషణ, దౌత్యంపై మొగ్గు చూపాలి” అని అన్నారు. వచ్చే 5 రోజుల వరకు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయవద్దని ట్రంప్ సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని, దాదాపు 15 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. అయితే టెహ్రాన్ (ఇరాన్) ట్రంప్ వాదనలను తోసిపుచ్చింది.
Also Read: Philips launches ‘OneChef’ : ఒకే పరికరంలో 33 వంటలు చేసుకోవచ్చు..ఎలాగో తెలుసా ?
దౌత్య మార్గాలకు కేంద్రంగా పాకిస్థాన్: నివేదిక
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆదివారం (మార్చి 23, 2026) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు. ఆ మరుసటి రోజే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. అనంతరం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తన ఇరాన్, తుర్కియే సహచరులతో విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. ఈ వారాంతంలో ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా ఉన్నతాధికారుల మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ ‘ఛానల్ 12’ ఒక సీనియర్ ఇజ్రాయెలీ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.
ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఇరాన్
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల పూర్తి పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్ మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ ఖండించింది. ఇవి కేవలం “ఫేక్ న్యూస్” అని ఇరాన్ కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా ఇరాన్ స్పందిస్తూ “అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికి అలాగే అమెరికా, ఇజ్రాయెల్ చిక్కుకున్న ఊబి నుండి బయటపడటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు” అని పేర్కొంది.