మరో సీజ్ఫైర్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన!
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఈ ఒప్పందానికి వాషింగ్టన్లో పునాది పడిందని, అక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ముఖాముఖిగా కలిశారని ఆయన తెలిపారు.
- Author : Gopi
Date : 17-04-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
Ceasefire: మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇప్పుడు లెబనాన్ నుండి ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. ఇజ్రాయెల్- లెబనాన్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా ఇరాన్-అమెరికా యుద్ధం ఆగిపోయినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్‌పై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
34 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక భేటీ
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఈ ఒప్పందానికి వాషింగ్టన్లో పునాది పడిందని, అక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ముఖాముఖిగా కలిశారని ఆయన తెలిపారు. గమనార్హం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య గత 34 ఏళ్లలో ఇదే మొదటి అధికారిక సమావేశం. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు.
Also Read: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ వార్ ముగిసినట్లేనా?
‘9 యుద్ధాలను పరిష్కరించాను, ఇది 10వది’
ఎప్పటిలాగే తనదైన శైలిలో ఈ విజయం క్రెడిట్‌ను ట్రంప్ తీసుకున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడం నాకు దక్కిన గౌరవం, నేను శాంతింపజేయబోయే 10వ యుద్ధం ఇది’ అని ఆయన పేర్కొన్నారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహులతో జరిగిన సంభాషణలను ‘అద్భుతం’ అని ట్రంప్ అభివర్ణించారు. ఈ 10 రోజుల కాల్పుల విరమణ కేవలం ప్రారంభం మాత్రమేనని, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పడమే తన అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కేన్లకు ఈ రెండు దేశాలతో కలిసి మరింత బలమైన, దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ట్రంప్ బాధ్యతలు అప్పగించారు.
వైట్ హౌస్‌లో ‘శాంతి చర్చలు’
పీఎం నెతన్యాహు, ప్రెసిడెంట్ జోసెఫ్ ఔన్లను వైట్ హౌస్‌కు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. 1983 తర్వాత ఇరు దేశాల అగ్రనేతలు ఒకే టేబుల్‌పై కూర్చుని శాంతి గురించి చర్చించడం ఇదే మొదటిసారి కానుంది. ఈ చొరవ తీసుకున్నందుకు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.