Donald Trump : నా శ్రమతోనే బైడెన్‌ను ఇంటికి పంపించా.. మస్క్‌తో ట్రంప్ సంచలన ఇంటర్వ్యూ
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
- By Pasha Published Date - 08:42 AM, Tue - 13 August 24

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మస్క్ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించి ట్రంప్ నుంచి సమాధానం రాబట్టారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఈ ఇంటర్వ్యూను 10 లక్షల మందికిపైగా లైవ్‌లో వీక్షించారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
కష్టపడి అద్భుత డిబేట్ చేశా
తాను చాలా కష్టపడి, అత్యంత ప్రభావవంతంగా డిబేట్ చేసినందు వల్లే అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. డిబేట్‌లో తాను బైడెన్‌ను ఎంత దారుణంగా మట్టి కరిపించానో అందరూ లైవ్‌లో చూశారని చెప్పారు. తాను పాల్గొన్న అత్యంత ప్రభావవంతమైన డిబేట్ అదేనని 78 ఏళ్ల ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే అమెరికా అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతానని బైడెన్ ప్రకటించాల్సి వచ్చిందన్నారు.
దారుణంగా చంపాలనుకున్నారు
‘‘నన్ను దారుణంగా చంపాలని అనుకున్నారు. కానీ కొంచెంలో తప్పించుకున్నాను. చెవి దగ్గర దారుణమైన గాయమైంది. ఇదంతా నాతోనే జరిగింది. అది ఊహ కాదు.. నిజమే’’ అని తనపై జరిగిన కాల్పుల ఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. తన చెవిలోకి బుల్లెట్ దూసుకెళ్లిన ఆ క్షణాన్ని తాను మర్చిపోలేనన్నారు. దేవుడిని నమ్మని వారు తన పరిస్థితిని అర్థం చేసుకోలేరని ఆయన పేర్కొన్నారు. 53 ఏళ్ల అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ముచ్చటిస్తూ.. ‘‘ఇది ఈ శతాబ్దపు గొప్ప ఇంటర్వ్యూగా నిలిచిపోతుంది’’ అని ట్రంప్ చెప్పారు.
2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు అమెరికా కాంగ్రెస్ భవనంపై దాడి చేశారు. దీంతో ట్రంప్ ట్విట్టర్ అకౌంటును సస్పెండ్ చేయాలని అప్పటి కంపెనీ యజమానులు నిర్ణయించారు. అయితే తదనంతరం ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనేశారు. ఆ పరిణామం చోటుచేసుకున్న నెల రోజుల తర్వాత ట్రంప్ ట్విట్టర్ అకౌంటుపై బ్యాన్‌ను మస్క్ ఎత్తేశారు.తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ఇంటర్వ్యూ వీడియోను కూడా ట్రంప్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వైపే నిలవాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. దీనిపై ఆయన గత నెలలోనే ఓ ప్రకటన చేశారు. రిపబ్లికన్ పార్టీకి భారీ విరాళం కూడా అందించారు.