CM Revanth : తెలంగాణలో హ్యుందాయ్ కారు మెగా టెస్ట్ సెంటర్ : సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన కూడా విజయవంతమైంది.
- By Pasha Published Date - 07:48 AM, Tue - 13 August 24

CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన కూడా విజయవంతమైంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. చర్చల అనంతరం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE) ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, అక్కడి వినియోగదారుల కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక వాహనా పరీక్షా సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth) కృతజ్ఞతలు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందుకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ HMIE ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాల వల్లే HMIE వంటి పెద్ద కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలను పెంచుతున్నాయని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్‌లో ఉండబోయే సౌకర్యాలు ఇతర కంపెనీలను కూడా తెలంగాణ వైపు ఆకర్షించే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని రేవంత్ తెలిపారు. కాగా, హ్యుందాయ్ మోటార్ మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయం ఉంటుంది. దీంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (EVలతో సహా) ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇంజినీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, విస్తరణ ద్వారా HMIE భారతదేశం సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత మందికి ఉపాధిని కల్పించనుంది.