America Clarity: అవి గ్రహాంతర వాసుల వాహనాలు కాదు.. అమెరికా క్లారిటీ
గగనతలంపై ఇటీవల కనిపించిన గుర్తుతెలియని ఎగిరే వస్తువులను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే.
- By Maheswara Rao Nadella Published Date - 11:25 AM, Tue - 14 February 23

గగనతలంపై ఇటీవల కనిపించిన గుర్తుతెలియని ఎగిరే వస్తువులను అమెరికా (America) కూల్చేసిన విషయం తెలిసిందే. ఇవి గ్రహాంతర వాసుల వాహనాలంటూ అమెరికాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం అని నార్త్ అమెరికన్ ఎయిరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నోరాడ్) హెడ్ గ్లెన్ డి వాన్ హెరిక్ చెప్పడంతో మరింత గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరినె జీన్ పీరే స్పష్టతనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అమెరికా (America) సైన్యం కూల్చేసిన వాహనాలు గ్రహాంతర వాసులవేనంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రకటించారు. ఏలియన్స్ ఉనికికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆమె వివరించారు.
ఫిబ్రవరి 4న చైనాకు చెందిన స్పై బెలూన్ ను కూల్చేశాక వారం వ్యవధిలోనే మూడు గుర్తుతెలియని ఎగిరే వస్తువులను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేశాయని పీరే తెలిపారు. సదరు వస్తువుల శకలాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నామని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఆ మూడింటిలో ఒక్కదానికి సంబంధించిన శకలాలు కూడా సేకరించలేదని చెప్పారు. ఆ శకలాలను పరీక్షించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు.
Also Read: Aliens: అమెరికా కూల్చేసిన గుర్తుతెలియని వస్తువులు ఏలియన్స్ వా ?