Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!
ఈ విధంగా మోహరింపుతో ఎప్పుడైనా వెనుజువెలాపై ప్రత్యక్ష దాడి జరుగవచ్చనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో తన హయాంలో ఏడు యుద్ధాలు ఆపానని గొప్పగా చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు మరో దేశంపై సైనిక చర్యకు సన్నద్ధమవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- By Latha Suma Published Date - 06:04 PM, Sun - 7 September 25

Venezuela : కరేబియన్ సముద్రం ఒడిదుడుకుల వేదికగా మారుతోంది. ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో, అమెరికా భారీ స్థాయిలో తన సైనిక బలగాలను అక్కడ మోహరించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరున్న వెనుజువెలాపై పరోక్షంగా కన్నేసినట్లు అమెరికా చర్యలు సంకేతాలిస్తున్నాయి. తాజాగా అమెరికా, అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్‌లు తదితర సామరస్యంతో కరేబియన్‌ను చుట్టుముట్టింది. ఈ విధంగా మోహరింపుతో ఎప్పుడైనా వెనుజువెలాపై ప్రత్యక్ష దాడి జరుగవచ్చనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో తన హయాంలో ఏడు యుద్ధాలు ఆపానని గొప్పగా చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు మరో దేశంపై సైనిక చర్యకు సన్నద్ధమవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్ మాఫియానే లక్ష్యమా? లేక చమురు?
ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యలకు తగిన అధికారిక కారణాన్ని వెల్లడించింది. వెనుజువెలా నుంచి అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవేశం పెరుగుతుండటం, వాటిని అరికట్టేందుకే ఈ సైనిక మోహరింపు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాదు, వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ఈ డ్రగ్స్ మాఫియా ముఠాలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. మదురో సమాచారం తెలిపినవారికి 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 430 కోట్లు) నజరానా ప్రకటించటం, ట్రంప్ సోషల్ మీడియాలో “మదురో ప్రభుత్వానికి రోజులు చెల్లిపోయాయి” అనే హెచ్చరికలు ఇవ్వడం, ఈ సంక్షోభాన్ని మరింత ఉద్రిక్తతకు నెడుతున్నాయి. ఇక మదురో ఎన్నికను గుర్తించబోమని వైట్ హౌస్ ప్రకటించటం కూడా ఈ వ్యవహారంలో రాజకీయ ఉద్దేశాలున్నాయన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
అమెరికా వ్యూహంపై విమర్శలు
అమెరికా చేస్తున్న ఈ సైనిక చర్యను అంతర్జాతీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యాపారంపై పోరాటం కాదని, వెనుజువెలాలోని అపారమైన చమురు వనరులపై ఆధిపత్యం కోసం పన్నిన వ్యూహమని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వెనుజువెలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. తీవ్ర రాజకీయ అస్థిరత కూడా నెలకొంది. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకుంటూ, ఆ దేశంపై పరోక్ష ఆధిపత్యాన్ని సాధించాలన్నదే అమెరికా అసలైన ఉద్దేశమని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ దేశాల ఆందోళన
ట్రంప్ ప్రోత్సహిస్తున్న గన్‌బోట్ డిప్లమసీ (ఆయుధ బలంతో బెదిరించడం) ఈసారి క్షేత్రస్థాయిలో సైన్యాన్ని మోహరించడంలో కనిపించడంతో, ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడకుండా అమెరికా సంయమనంతో వ్యవహరించాలి అని పలు దేశాలు సూచిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే, కరేబియన్ ప్రాంతం తీవ్రమైన భౌగోళిక మరియు రాజకీయ పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ శాంతికి ప్రమాదం వాటిల్లేలా చేస్తున్న ఈ చర్యలను ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పర్యవేక్షిస్తున్నాయి.