Hormuz Strait: పాక్‌కు షాక్.. అనుమతి లేదంటూ పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
- Author : Vamsi Chowdary Korata
Date : 25-03-2026 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
Iran హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ నౌకను ఇరాన్ వెనక్కి రప్పించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి అనుమతులను తప్పనిసరి చేసింది.
ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ నౌక హర్మూజ్ మీదుగా కరాచీ వెళుతోంది. అయితే అనుమతులు లేకుండా ప్రయాణించడంతో ఆ నౌకను వెనక్కి రప్పించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. హర్మూజ్ గుండా వెళ్లే ప్రతి నౌక ఐఆర్జీసీ సముద్ర అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌కు చెందిన నౌకను ఇరాన్ వెనక్కి రప్పించినట్లు కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జా నుండి ఈ నౌక కరాచీకి వెళుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ జలసంధి గుండా తాము అనుమతించిన నౌకలు మాత్రమే వెళ్లాలని చెబుతోంది.