North Korea : ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలుంటే.. మాకు ఉత్తర కొరియా ఉంది : రష్యా
ఇక దాదాపు 10వేల మంది ఉత్తర కొరియా(North Korea) సైనికులు తూర్పు రష్యాలో ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.
- By Pasha Published Date - 11:39 AM, Thu - 31 October 24

North Korea : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం వేదికగా రష్యా కీలక వాదనను తెరపైకి తెచ్చింది. పశ్చిమ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అన్ని రకాల సాయం చేస్తున్నప్పుడు.. తమకు ఉత్తర కొరియా లాంటి మిత్రదేశాలు సాయం చేయడంలో తప్పేముందని ఐక్యరాజ్యసమితిలోని రష్యా రాయబారి వాసిలే నెబెంజియా ప్రశ్నించారు. తమకు కూడా మిత్రదేశాల సాయం పొందే హక్కు ఉందన్నారు. అయితే ఉత్తర కొరియా దళాలను యుద్ధ రంగంలో మోహరించడం ద్వారా ఐక్యరాజ్యసమితి తీర్మానాలను, వ్యవస్థాపక ఛార్టర్‌ను రష్యా ఉల్లంఘించిందని అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు ఆరోపించారు.
Also Read :Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్‌బీఐ మెగా మిషన్
ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గి కిస్లిత్స్య మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు సహాయం అందిస్తున్న దేశాలేవీ భద్రతా మండలి ఆంక్షల పరిధిలో లేవన్నారు. ఉత్తర కొరియా లాంటి దేశాలు ఆంక్షల పరిధిలో ఉన్నందున, ఇతర దేశాలకు సాయం చేసే హక్కు వాటికి లేదని చెప్పారు. ఉత్తర కొరియా లాంటి దేశాల సాయం పొందడం కూడా తప్పే అన్న విషయాన్ని రష్యా గ్రహించాలని సెర్గి కిస్లిత్స్య పేర్కొన్నారు.
Also Read :Indian Army : తప్పుడు ‘సోషల్’ పోస్టులకు చెక్.. భారత ఆర్మీకి కీలక అధికారం
ఇక దాదాపు 10వేల మంది ఉత్తర కొరియా(North Korea) సైనికులు తూర్పు రష్యాలో ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యా ప్రాంతం కుర్స్క్‌లో యుద్ధ అవసరాల కోసం ఉత్తర కొరియా సైనికులను వినియోగించుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాస్తవానికి ఉత్తర కొరియా 2006 సంవత్సరం నుంచి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ఆంక్షల పరిధిలో ఉంది. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధిని నిలిపివేసేందుకు అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా ఇవాళ ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అంతకుముందు సరిహద్దుల్లోని రోడ్లను ధ్వంసం చేసింది. తదుపరిగా దక్షిణ కొరియాతో యుద్ధం చేసేందుకే ఉత్తర కొరియా ఈవిధంగా రోడ్లను ధ్వంసం చేయించిందని అంటున్నారు.