Titan Submarine: టైటాన్ జలాంతర్గామి నుండి మానవ అవశేషాలు స్వాధీనం.. మొదటి ఫోటో ఇదే.. పేలుడుపై దర్యాప్తు..!
టైటానిక్ శిథిలాలను చూసేందుకు ప్రపంచంలోని ఐదుగురు బిలియనీర్లు జూన్ 18న టైటాన్ జలాంతర్గామి (Titan Submarine)లో కూర్చుని సముద్రంలో దిగారు.
- By Gopichand Published Date - 09:05 AM, Thu - 29 June 23

Titan Submarine: టైటానిక్ శిథిలాలను చూసేందుకు ప్రపంచంలోని ఐదుగురు బిలియనీర్లు జూన్ 18న టైటాన్ జలాంతర్గామి (Titan Submarine)లో కూర్చుని సముద్రంలో దిగారు. అయితే సముద్రంలో దిగిన 2 గంటలకే వారి కనెక్షన్ తెగిపోయింది. దానిని కనుగొనడానికి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ కోస్ట్ గార్డ్స్ చర్యలు ప్రారంభించాయి. ఇంతలో జూన్ 22న జలాంతర్గామి పేలిపోయి అందులో ఉన్న ఐదుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి మానవ అవశేషాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం (జూన్ 28) తెలియజేసింది.
మానవ అవశేషాలను తిరిగి అమెరికాకు తీసుకువస్తున్నట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను బుధవారం (జూన్ 28) భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలను, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. ఈ శిథిలాలలో మానవ అవశేషాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో US కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన సాక్ష్యాలను తిరిగి పొందడంలో అంతర్జాతీయ, అంతర్-ఏజెన్సీ మద్దతుకు నేను కృతజ్ఞుడను అని అన్నారు.
యుఎస్ కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ మాట్లాడుతూ.. శిథిలాల రూపంలో లభించిన సాక్ష్యాలు అంతర్జాతీయ పరిశోధకులకు వివిధ సమాచారాన్ని సేకరించడంలో సహాయపడతాయని అన్నారు. రాబోయే కాలంలో అనేక కారణాలను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా ఇలాంటి సాక్ష్యాధారాల వల్ల మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా చూసేందుకు ఉపకరిస్తుందన్నారు.
టైటానిక్ శిథిలాల సమీపంలో సముద్రపు అడుగుభాగంలో జలాంతర్గామి శకలాలు వెతకడానికి కెనడియన్ నౌక హారిజన్ ఆర్కిటిక్ ద్వారా మానవరహిత ROV పంపబడింది. ఈ ప్రమాదంలో మరణించిన బిలియనీర్ల అవశేషాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ బృందం ఇంకా మిషన్‌లో ఉందని హారిజన్ ఆర్కిటిక్ కంపెనీ ప్రతినిధి జెఫ్ మహోనీ చెప్పారు. దీని కారణంగా కొనసాగుతున్న విచారణపై వ్యాఖ్యానించలేదు. ఈ ఆపరేషన్‌లో శారీరక, మానసిక సవాళ్ల మధ్య పదిరోజులుగా రాత్రింబవళ్లు పని చేస్తున్నట్టు తెలిపారు.
488 మీటర్ల దూరం వెళ్లాక శిథిలాలు
సముద్రపు అడుగుభాగంలో టైటానిక్ శిథిలాలు 12,500 అడుగుల (3,810 మీ) నీటి అడుగున,1,600 అడుగుల (488 మీ) దూరంలో ఉన్నాయని కోస్ట్ గార్డ్ గత వారం తెలిపింది. జూన్ 18న జలాంతర్గామి ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలిపోయిందనే దానిపై కోస్ట్ గార్డ్ విచారణ జరుపుతోంది. జలాంతర్గామి పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు మరణించారని జూన్ 22న అధికారులు ప్రకటించారు. పేలుడుపై దర్యాప్తు చేసేందుకు కోస్ట్ గార్డ్ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది.