Typhoon Shanshan: జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. ఇప్పటికే ఐదుగురు మృతి
టైఫూన్ కారణంగా క్యుషు అంతటా భారీ వర్షాలు కురిశాయని, ఆ తర్వాత హోన్షు ద్వీపం వైపు తుపాను కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.
- By Gopichand Published Date - 07:02 AM, Fri - 30 August 24

Typhoon Shanshan: ప్రమాదకరమైన టైఫూన్ షన్షాన్ (Typhoon Shanshan) జపాన్‌లో విధ్వంసం సృష్టించింది. గురువారం నుండి జపాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా 5 మంది మరణించారు. చాలా మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. స్థానిక మీడియా ప్రకారం.. పరిపాలన ప్రజలను ఉన్నత స్థానాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. కొండచరియలు విరిగిపడడం, వరదల ముప్పు పెరిగే పరిస్థితి నెలకొంది. టైఫూన్ షన్షాన్ గురువారం జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషుపై గంటకు 252 కిమీ (157 mph) వేగంతో గాలులు వీచింది. షన్షాన్ ఈ సంవత్సరం అత్యంత శక్తివంతమైన తుఫాను. దీంతో 1960 నుంచి జపాన్‌ను తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్‌లలో ఇది ఒకటిగా మారింది.
స్థానిక కాలమానం ప్రకారం 5 గంటలకు తుఫాను తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో గంటకు 162 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. టైఫూన్ కారణంగా క్యుషు అంతటా భారీ వర్షాలు కురిశాయని, ఆ తర్వాత హోన్షు ద్వీపం వైపు తుపాను కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. జిజి ప్రెస్ ప్రకారం.. టైఫూన్ కారణంగా 5 మంది మరణించారు. తోకుషిమాలో రెండంతస్తుల భవనం కుప్పకూలినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విపత్తు పెరిగే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. షన్షాన్ తుపాను రాకముందే గురువారం అయిచిలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఐచి క్యుషు నుండి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. 1000 మందికిపైగా మృతి..!
హై అలర్ట్ ప్రకటించారు
జపాన్‌లోని వివిధ ప్రాంతాలకు పరిపాలన హై అలర్ట్ ప్రకటించింది. 50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జపాన్ వాతావరణ విభాగం ప్రకారం.. క్యుషులో 80 మందికి పైగా గాయపడ్డారు. మియాజాకిలో 200 కంటే ఎక్కువ భవనాలు దెబ్బతిన్నాయి. 25 మందికి పైగా గాయపడ్డారు. గాలివాన ధాటికి కొంత మంది గాయపడినట్లు సమాచారం. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం.. గత 48 గంటల్లో మిసాటో నగరంలో 791.5 మిల్లీమీటర్లు (31 అంగుళాలు) వర్షం నమోదైంది. 1.87 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్యుషులోని విద్యుత్ శాఖ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.