యుద్ధం ఎఫెక్ట్‌తో కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
- Author : Vamsi Chowdary Korata
Date : 14-04-2026 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Stock Market అమెరికా- ఇరాన్ మధ్య ఇటీవల యుద్ధం ముగింపు కోసం జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరంభంలో భారీగా పతనమైనా, ఆఖర్లో కాస్త నష్టాల్ని తగ్గించుకున్నాయి. ఇదే క్రమంలో సోమవారం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కేఎస్ఈ-100 ఏకంగా ఒక్కరోజులోనే 6 వేల పాయింట్లకు పైగా పతనమైంది.
సోమవారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE- 100 ఇంట్రాడేలో దాదాపు 6 వేల పాయింట్లకు పైగా పతనం కాగా, ఇన్వెస్టర్లు దారుణంగా నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు కోసం చర్చలు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ ప్రధాన కేంద్రంగానే జరగ్గా, ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరిక మేరకే కాల్పుల విరమణకు అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. తర్వాత చర్చలు ప్రారంభం కాగా, ఇవి ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. ట్రంప్ ఆ తర్వాత మరిన్ని కీలక ప్రకటనలు చేశారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రధానంగా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.
సోమవారం సెషన్‌లో ఈ పాకిస్థాన్ ఇండెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో దాదాపు 4 శాతం వరకు పతనమై 1,61,638 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. అంతకుముందు వారంలో కాల్పుల విరమణ నేపథ్యంలో, అది కూడా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన కారణంగా రికార్డు స్థాయిలో పుంజుకుంది. అప్పుడు ఒక్కరోజులోనే 12 వేల పాయింట్ల వరకు పెరిగినట్లు తెలిసింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం అదే తొలిసారి. ఇప్పుడు మళ్లీ చర్చలు విఫలమైన నేపథ్యంలో 6 వేల పాయింట్లకు పైగా పతనం కావడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వాటిల్లాయి.
ఇదిలా ఉండగా, భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా సోమవారం సెషన్‌లో ఒక దశలో భారీగా పతనం అయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పతనమైంది. ఆఖర్లో కాస్త కోలుకోగా చివరకు సెన్సెక్స్ 703 పాయింట్ల నష్టంతో 76,848 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 208 పాయింట్లు తగ్గి 23,843 వద్ద సెషన్ ముగించింది. మరోసారి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండగా, ఇదే సమయంలో దేశీయ కొనుగోలుదారులు వేల కోట్ల మేర కొనుగోళ్లు జరుపుతున్నారు.
మార్కెట్ నష్టాల నేపథ్యంలో ఏప్రిల్ 13న మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.1 లక్షల కోట్ల మేర తగ్గడంతో రూ. 449.13 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇక్కడ ప్రధానంగా పలు హెవీ వెయిట్ స్టాక్స్ పతనం అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటివి 2 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంది. అయితే, అమెరికా- ఇరాన్ రెండో దశ చర్చలు జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో బుధవారం సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్‌లో నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభపడినట్లు చూపిస్తోంది.