Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..!
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Pakistan Ceasefire) ఉల్లంఘించింది.
- By Gopichand Published Date - 06:55 AM, Thu - 15 February 24

Pakistan Ceasefire: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Pakistan Ceasefire) ఉల్లంఘించింది. బుధవారం (ఫిబ్రవరి 14, 2024) జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) పోస్ట్‌పై కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్వాల్‌లోని సరిహద్దు పోస్ట్‌లో మోహరించిన BSF సైనికులు సరిహద్దు ఆవల నుండి కాల్పులకు తగిన సమాధానం ఇచ్చారు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన ఈ కాల్పులు 20 నిమిషాలకు పైగా కొనసాగాయి. భారత్ వైపు ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరగలేదని ఆయన చెప్పారు.
అంతకుముందు కూడా కాల్పులు జరిగాయి
గత సంవత్సరం నవంబర్ 8-9 మధ్య రాత్రి సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక BSF జవాన్ వీరమరణం పొందాడు. ఫిబ్రవరి 25, 2021న రెండు దేశాలు తాజా కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇది మొదటి మరణం. అక్టోబర్ 26న జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో సరిహద్దు కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ఒక మహిళ గాయపడగా.. అక్టోబర్ 17న ఇదే ఘటనలో మరో బీఎస్‌ఎఫ్ జవాన్ గాయపడ్డారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 20న కేంద్రపాలిత ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటన వెలుగులోకి వచ్చింది. తన పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ జమ్మూలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు.
We’re now on WhatsApp : Click to Join