Pakistan Vs Taliban : ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 15 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్లు
అయితే ఈ దాడులు చేసింది తామేనని పాకిస్తాన్(Pakistan Vs Taliban) ధ్రువీకరించలేదు.
- By Pasha Published Date - 10:25 AM, Wed - 25 December 24

Pakistan Vs Taliban : తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని బార్మల్ జిల్లా పక్తికా ప్రావిన్స్‌లో ఉన్న ఏడు గ్రామాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 15 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడుల్లో వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించారని సమాచారం. పాకిస్తాన్ వైమానిక దాడులను తాలిబన్ రక్షణ శాఖ ఖండించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది.
Also Read :GST On Old Cars : పాత కార్ల సేల్స్‌పై ఇక నుంచి జీఎస్టీ ఎలా విధిస్తారంటే..
అయితే ఈ దాడులు చేసింది తామేనని పాకిస్తాన్(Pakistan Vs Taliban) ధ్రువీకరించలేదు. తమ దేశ సరిహద్దుకు సమీపంలో ఉన్న ‘తెహ్రీక్-ఏ-తాలిబన్ ’ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేశామని పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తదుపరిగా తాలిబన్లు ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది మార్చి నెలలో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లోని టీటీపీ ఉగ్ర స్థావరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్‌లో గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న ఉగ్రదాడుల వెనుక టీటీపీ ఉగ్రసంస్థ ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే టీటీపీ ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ టార్గెట్‌గా చేసుకుంటోంది.
Also Read :Tsunami Boy : సునామీ బాయ్ ఎవరు ? బేబీ81 కథ ఏమిటి ?
తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ 2007లో ఏర్పాటైంది. పాకిస్తాన్‌లోని అతివాద సున్నీ సంస్థలన్నీ కలిసి టీటీపీని ఏర్పాటు చేశాయి. తొలినాళ్లలో ఈ సంస్థ బైతుల్లా మసూద్ ఆధ్వర్యంలో నడిచేది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ పనిచేసేది. టీటీపీలో దాదాపు 35వేల ఫైటర్లు ఉన్నారని అంచనా. టీటీపీ సంస్థకు తాలిబన్ల నుంచి ఆయుధాలు, ఆర్థికసాయం అందుతున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.