Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!
చెన్ నింగ్ యంగ్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయన రెండు గొప్ప దేశాల సాంస్కృతిక వారసత్వాన్ని మోసిన వ్యక్తి. ఆయన చేసిన పరిశోధనలు, అందించిన జ్ఞానం భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.
- By Gopichand Published Date - 09:25 AM, Sun - 19 October 25

Chinese Physicist Chen-Ning Yang: అపారమైన శాస్త్రీయ కృషికి ప్రతీకగా నిలిచిన నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చెన్ నింగ్ యంగ్ (Chinese Physicist Chen-Ning Yang) కన్నుమూశారు. ఆయన మరణాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది. 1922లో జన్మించిన చెన్ నింగ్ యంగ్, కణ భౌతిక శాస్త్రం (Particle Physics) రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన చేసిన అసాధారణ పరిశోధనలకు గుర్తింపుగా 1957లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ అత్యున్నత పురస్కారం ఆయన శాస్త్రీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది. క్వాంటం మెకానిక్స్, కణ భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన కృషి అనేక కొత్త సిద్ధాంతాలకు, పరిశోధనలకు మార్గదర్శకమైంది.
ప్రొఫెసర్ యంగ్ సుదీర్ఘ కాలం పాటు అమెరికాలో నివసించారు. పనిచేశారు. 1964లో ఆయన అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అయితే ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతూ 2015లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని తిరిగి చైనాకు వచ్చారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని ఒక సందర్భంలో వివరిస్తూ “చైనా సంస్కృతి తన నరనరాల్లో ఉందనీ, ఆ సంస్కృతికి తన అనుబంధమే దీనికి కారణం” అని పేర్కొన్నారు. తన మూలాలపై ఆయనకున్న లోతైన ప్రేమ, గౌరవాన్ని ఈ చర్య ప్రతిబింబించింది.
Also Read: Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇటలీలో చిక్కుకున్న ప్రయాణీకులు!
చెన్ నింగ్ యంగ్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయన రెండు గొప్ప దేశాల సాంస్కృతిక వారసత్వాన్ని మోసిన వ్యక్తి. ఆయన చేసిన పరిశోధనలు, అందించిన జ్ఞానం భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. భౌతిక శాస్త్రంలో ఆయన ముద్ర శాశ్వతమైనది. సైన్స్ ప్రపంచం ఒక గొప్ప మేధావిని కోల్పోయింది. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆవిష్కరణలు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటాయి.