Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ ఆయనే..!
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు.
- By Gopichand Published Date - 12:53 PM, Fri - 4 November 22

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమి 64 స్థానాలు సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన నెతన్యాహు.. మరోసారి ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నారు. ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ గురువారం తన ప్రత్యర్థి బెంజమిన్ నెతన్యాహు విజయం గురించి అభినందిస్తూ.. తన ఓటమిని అంగీకరించారు. 120 మంది సభ్యులున్న నెస్సెట్ – ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమి 64 సీట్లను గెలుచుకుంది.
73 ఏళ్ల నెతన్యాహు లికడ్ పార్టీ అధినేత. ఇజ్రాయెల్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాన మంత్రి పదవిలో కొనసాగిన రికార్డు ప్రస్తుతం ఆయన పేరు మీదే ఉంది. మళ్లీ ఇప్పుడు ఆయన ప్రధాని పీఠం ఎక్కనున్నారు. లికడ్ పార్టీ నాయకత్వంలోని కూటమిలో జియోనిజం, షాస్, యునైటెడ్ టారా జుడేయిజం వంటి పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో గత నాలుగేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి.
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ట్విట్టర్ లో “భారత్,ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి మా ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. “భారతదేశం, ఇజ్రాయెల్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైన సహకారం” అందించినందుకు పదవీ విరమణ చేసిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యైర్ లాపిడ్‌కు కూడా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.