Buddha Air Flight : బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌కు బయల్దేరే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
- By Latha Suma Published Date - 01:30 PM, Mon - 6 January 25

Buddha Air Flight : నేపాల్‌లో బుద్ధ ఎయిర్లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో, విమానాన్ని అత్యవసరంగా కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు. అనంతరం విమానాన్ని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌కు బయల్దేరే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అయితే ఈ విషయంపై బుద్ధ ఎయిర్లైన్స్ స్పందించింది. వారు విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, విమానాన్ని తిరిగి కాఠ్మాండూ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాం. ఉదయం 11:15 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మా సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేస్తోంది. ఇక, మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని వారు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Cherlapally Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోడీ