Cherlapally Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోడీ
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచే ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
- By Latha Suma Published Date - 01:00 PM, Mon - 6 January 25

Cherlapally Terminal : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్ విధానంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని ఏర్పాటు చేశారు.
ఫస్ట్ ఫ్లోర్‌లో కేఫీటేరియా, రెస్టారంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్టణం, కోల్‌కతా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం కావడంతో నేటి నుంచే ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారంతో వివిధ ప్రాజెక్టుల అమలుకు పరస్పర సహకారం అందించు కోవాలని సూచించారు. ఇప్పటిదాకా 32 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం అందించిందని చెప్పారు. ఇక, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. చర్ల పల్లి రైల్వే టెర్మినల్ నుంచి రవాణా సదుపాయాల మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టుల అమలుకోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషి చేయాలని సూచించారు.
Read Also: Dil Raju : ‘వకీల్ సాబ్’ను పవన్ కల్యాణ్ గుర్తు చేయగానే కన్నీళ్లు వచ్చాయి : దిల్ రాజు