Israel Vs Syria : సిరియాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 44 మంది మృతి
Israel Vs Syria : ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.
- Author : Pasha
Date : 30-03-2024 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
Israel Vs Syria : ఇజ్రాయెల్ దళాలు సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. సిరియాలోని అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడిలో మొత్తం 44మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో 36 మంది సైనికులే ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. లెబనాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు అలెప్పో విమానాశ్రయం సమీపంలో క్షిపణి నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని సమాచారం. ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపులకు చెందిన సైనిక ఉత్పత్తుల ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులను సిరియా సైన్యం(Israel Vs Syria) కూడా ధ్రువీకరించింది.
We’re now on WhatsApp. Click to Join
ఇజ్రాయెల్, సిరియాలోని తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని వెల్లడించింది. ఈ దాడిలో మరణించిన వారిలో ఏడుగురు హిజ్బుల్లా ఉగ్రవాదులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారని తెలిపింది. అయితే ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. సిరియా రాజధాని డమస్కస్ శివార్లలోనూ ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు చనిపోయారు. హిజ్బుల్లా సహా ఇరాన్ మద్దతుగల మిలిటెంట్ గ్రూపులకు సిరియాలో ప్రధాన స్థావరంగా నిలుస్తున్న సయ్యిదా జైనబ్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.
Also Read :Daniel Balaji : తెలుగు మూలాలున్న కోలీవుడ్ విలన్ కన్నుమూత
రంజాన్ నెల సందర్భంగా పాలస్తీనాలోని గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఇటీవలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. దీంతోపాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకుగానూ 14 ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇజ్రాయెల్‌పై తొలిసారిగా ఒత్తిడిని పెంచేందుకుగానూ ఈ ఓటింగ్ నుంచి అమెరికా దూరంగా ఉండిపోయింది.