Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత
ఈ లగ్జరీ నౌక నిర్మాణానికి అక్షరాలా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లకు పైగా వ్యయం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన ఈ నౌకను ప్రారంభించేందుకు యజమాని అతని బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
- By Latha Suma Published Date - 12:05 PM, Thu - 4 September 25

Northern Turkey : ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరంలో ఆశ్చర్యకరంగా ఓ లగ్జరీ నౌక ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్ సంస్థ వద్ద నిర్మించిన ఈ నౌక ప్రారంభోత్సవం గందరగోళానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చకు కేంద్రబిందువైంది. ఈ లగ్జరీ నౌక నిర్మాణానికి అక్షరాలా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.74 కోట్లకు పైగా వ్యయం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన ఈ నౌకను ప్రారంభించేందుకు యజమాని అతని బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ప్రయాణ ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కానీ ఆ సంతోషం కొన్ని నిమిషాలకే భయంకర దృశ్యంగా మారింది.
Read Also: Vladimir Putin: అమెరికా సుంకాలపై పుతిన్ ఆగ్రహం
నౌక సముద్రంలోకి ప్రవేశించిన 15 నిమిషాల్లోనే నీళ్లలోకి మునిగడం మొదలైంది. ఈ పరిణామాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొంతమంది వెంటనే లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకారు. అప్పటికే సముద్రతీరానికి సమీపంలో రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో, వారు వెంటనే స్పందించి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ప్రమాద సమయంలో నౌక యజమాని, కెప్టెన్ కూడా నౌకపై ఉన్నారు. నౌక మునిగిపోతున్న దృశ్యం చూసి వారిద్దరూ నిశ్చేష్టులైపోయారు. చివరకు ఆ పరిస్థితిలో చేయగలిగిందల్లా తామూ సముద్రంలోకి దూకడం మాత్రమే. అదృష్టవశాత్తూ వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ ఘటనపై స్పందిస్తూ, ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. నౌక మునిగిపోయిన తీరుపై పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించాం. నిజమైన కారణాలు తెలియాలంటే కొన్ని రోజులు పడే అవకాశముంది అని తెలిపారు. కాగా, ప్రాథమికంగా ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులు భయంతో సముద్రంలోకి దూకుతున్న దృశ్యాలు నెటిజన్లను తీవ్రంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అందరూ సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం అంటూ కొంతమంది వ్యక్తాలు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఇంత భారీగా ఖర్చు పెట్టిన లగ్జరీ నౌక మొదటి ప్రయాణంలోనే ఇలా మునిగిపోవడం సంచలనం రేపింది. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నౌకారంగ పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నిమిషాల్లోనే ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన రూ.8.74 కోట్ల విలువైన నౌక ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరంలో ఘటన నౌక మునిగిపోయే సమయంలో భయంతో సముద్రంలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు, సిబ్బంది #Zonguldak #HashtagU pic.twitter.com/rTDZRtaH17
— Hashtag U (@HashtaguIn) September 4, 2025
Read Also: CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!