Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 4:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఫిబ్రవరి 28న ఆయన కన్నుమూయగా, భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు పార్థివ దేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచారు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో, వారం రోజుల పాటు సాగే ఈ అంతిమ యాత్ర కోసం ఇరాన్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. జూలై 9న ఆయన స్వస్థలమైన మషద్‌లో ఖననం నిర్వహించనున్నారు.
ఖమేనీ శవపేటిక శుక్రవారం నాటికి టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా సముదాయానికి చేరుకుంది. మూడు రోజుల పాటు ఇక్కడ ప్రజలు, ఉన్నతాధికారులు, సైనిక సిబ్బంది మరియు విదేశీ ప్రతినిధుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచుతారు. ఆ తర్వాత పవిత్ర నగరం ఖోమ్‌లోనూ, ఇరాక్‌లోని నజాఫ్, కర్బలాల్లోనూ సంతాప కార్యక్రమాలు నిర్వహించి, చివరగా జూలై 9న మషద్‌లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమాల్లో కోట్లాది మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మరణించిన వారి శవాన్ని 24 గంటలలోపే ఖననం చేయాలి, అలాగే రసాయనాలతో ఎంబామింగ్ చేయడం కూడా నిషేధం. అయితే, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అధినేత ఖమేనీ మృతదేహం విషయంలో మినహాయింపు తీసుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు ఫోరెన్సిక్ మార్చురీలోని రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లో (ఫ్రీజింగ్) భద్రపరిచారు. యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో ఖననం ఆలస్యం కావడానికి షియా ధార్మిక నియమాల్లో ప్రత్యేక మినహాయింపు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంతిమ యాత్ర ద్వారా దేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని ఇరాన్ భావిస్తోంది. ప్రజలు ఈ యాత్రలో పెద్దఎత్తున తరలిరావాలని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా, భారత్ సహా పలు దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ వారసుడిగా నియమితులైన నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.