Longest Serving Prisoner : 46 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం.. ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
తాజాగా ఇప్పుడు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ జపాన్ కోర్టు సంచలన తీర్పును(Longest Serving Prisoner) వెలువరించింది.
- By Pasha Published Date - 12:08 PM, Thu - 26 September 24

Longest Serving Prisoner : ఆయన పేరు ఇవావో హకమద. వయసు 88 ఏళ్లు. అసలు విషయం ఏమిటంటే.. ఆయన తన జీవితంలో సగం కంటే ఎక్కువ టైం (46 ఏళ్లు) జైలులోనే గడిపారు. అది కూడా చేయని తప్పుకు శిక్ష అనుభవించారు. ఈవిషయాన్ని సాక్షాత్తూ జపాన్ కోర్టు అంగీకరించింది. ఇవావో హకమద నిర్దోషి అని.. తప్పుడు సాక్ష్యాలతో ఆయనను ఈ కేసులో ఇరికించి మరణశిక్ష విధించదగిన సెక్షన్లతో కేసును బనాయించారని సుదీర్ఘ విచారణ తర్వాత గుర్తించారు. ఈ వ్యవధిలో 1968 సంవత్సరం నుంచి 2014 వరకు ఆయన జైలులోనే గడపాల్సి వచ్చింది. 2014 సంవత్సరంలో ఇవావో హకమద జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా ఇప్పుడు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ జపాన్ కోర్టు సంచలన తీర్పును(Longest Serving Prisoner) వెలువరించింది. కేసు వివరాల్లోకి వెళితే..
1968 సంవత్సరం నాటికి ఇవావో హకమద ఒక కార్మికుడు. ఆయన ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే అప్పట్లో అకస్మాత్తుగా ఆ కంపెనీ యజమాని, యజమాని భార్య, ఇద్దరు పిల్లల మర్డర్స్ జరిగాయి. ఆ కేసుల్లో ఇవావో హకమదను పోలీసులు అరెస్టు చేశారు. వారందరికీ హకమద చంపాడని పోలీసులు అభియోగాలను బనాయించారు. ఈ కేసులో దాదాపు 500 మందికిపైగా ప్రజల సాక్ష్యాలను నమోదు చేశారు. అయితే ఇవావో హకమద కోసం అతడి సోదరి అలుపెరుగని న్యాయపోరాటం చేసింది. ఆ న్యాయపోరాటం చివరకు ఫలించింది. హకమద తరఫు న్యాయవాదులు 2014లో వాదనలు వినిపిస్తూ.. ‘‘హకమద దుస్తులపై ఉన్న రక్తపు మరకలకు అతడి డీఎన్ఏకు పోలికే లేదు.. అలాంటప్పుడు ఆ హత్యలు చేసింది హకమదనే అని ఎలా చెబుతారు’’ అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జపాన్ కోర్టు ఆయనను వెంటనే విడుదల చేసింది. కచ్చితమైన సాక్ష్యాలు లేనప్పుడు ఇంకా కొన్నేళ్ల పాటు హకమదను జైలులో ఉంచడం న్యాయం కాదని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించారు. తాజాగా ఇప్పుడు ఆయనపై ఉన్న కేసును పూర్తిగా కొట్టివేసింది.