Palestine : 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది.
- By Latha Suma Published Date - 11:19 AM, Mon - 20 January 25

Palestine : ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో రోమి గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరాన్ స్టెయిన్ బ్రేచర్ (31) ఉన్నారు. మొదటి దశలో 90మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది.
బందీలు స్వదేశానికి చేరుకున్న సందర్భంగా టెల్ అవీవ్‌లో వేలాది మంది ప్రజలు గుమికూడారు. వీక్షణ కోసం రోడ్లపై పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు గాజాలో ప్రజలు ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు స్వస్థలాలకు వెళ్లడం మొదలైంది. మొదటి దశలో కాల్పుల విరమణ 42 రోజులు కొనసాగనుంది. జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగడం ప్రారంభిస్తాయి. గాజాలోకి ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందించేందుకు అనుమతి ఇస్తుంది. మిగిలిన బందీలను రెండో దశలో హమాస్ విడుదల చేయనుంది.
ఈ దశలో 33 మంది బందీలు, దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలు దశల వారిగా విడుదలవుతారని భావిస్తున్నారు. రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అయితే, రెండో దశ సమయానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకుంటుందా అనే ఆందోళనసైతం వ్యక్తమవుతుంది. హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది.
కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన తర్వాత పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. ఈ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 250 మందిని హమాస్ బందీలుగా తీసుకుంది. ఇక ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేపట్టగా 46,000 మందికిపైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పదిహేను నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడినా దీర్ఘకాలం శాంతి నెలకొంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.