Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన అంశంపై చర్చించేందుకు ఇరాన్ ప్రభుత్వ భద్రతా మండలితో ఆయతుల్లా ఖమేనీ(Irans Supreme Leader) అత్యవసర భేటీ నిర్వహించారు.
- By Pasha Published Date - 03:40 PM, Sat - 28 September 24

Irans Supreme Leader : లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన భీకర దాడిలో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యారు. ఈనేపథ్యంలో ఇరాన్ అలర్ట్ అయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని భారీ భద్రత నడుమ సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్‌లో జరుపుతున్న భీకర దాడుల నేపథ్యంలో ఖమేనీ భద్రతపై ఇరాన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆయనను రహస్య ప్రాంతానికి పంపింది. మరోవైపు హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన అంశంపై చర్చించేందుకు ఇరాన్ ప్రభుత్వ భద్రతా మండలితో ఆయతుల్లా ఖమేనీ(Irans Supreme Leader) అత్యవసర భేటీ నిర్వహించారు. తదుపరిగా ఏం చేయాలి ? ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలా ? హిజ్బుల్లాకు సైనిక మద్దతును పెంచితే సరిపోతుందా ? హిజ్బుల్లా తదుపరి చీఫ్‌గా ఎవరిని నియమించాలి ? అనే అంశాలపై ఈసందర్భంగా ఆయతుల్లా ఖమేనీ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు లెబనాన్‌లో బలమైన ప్రతిఘటన ఎదురయ్యేలా చేసేందుకు ఏమేం చేయాలనే దానిపై వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో ఖమేనీ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Hate Rich People : డబ్బున్న వాళ్లంటే మనదేశంలో ద్వేషమెందుకో చెప్పిన జెరోధా సీఈఓ
శుక్రవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్ మాపై దాడి చేస్తే ఊరుకోం. మేం కూడా బలంగా దాడి చేస్తాం. తస్మాత్ జాగ్రత్త’’ అని స్పష్టం చేశారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ నుంచి ఎదురవుతున్న సమస్యలను ఇక భరించేది లేదని నెతన్యాహూ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను రక్షించే గొప్ప లక్ష్యంతో లెబనాన్‌పై తాము దాడులు చేస్తున్నామని ఆయన సమర్దించుకున్నారు. మిలిటెంట్ సంస్థలకు సహకరిస్తూ ఇరాన్ పెద్ద తప్పు చేస్తోందన్నారు. ఇజ్రాయెల్‌కు ముప్పుగా పరిణమించే ఏ ఒక్కరినీ వదిలేది లేదని నెతన్యాహూ పేర్కొన్నారు.