Iran Vs Israel : మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుంది : ఇరాన్
ఇజ్రాయెల్ (Iran Vs Israel) బలహీనతలు ఏమిటో తమకు తెలుసని, వాటి ప్రకారమే దాడులు ఉంటాయని ఆయన చెప్పారు.
- By Pasha Published Date - 02:59 PM, Thu - 17 October 24

Iran Vs Israel : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇటీవలే తమపై మిస్సైళ్లతో దాడి చేసినందుకు ఇరాన్‌పై ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ స్కెచ్‌ను రెడీ చేసింది. ఏ రోజైనా అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పదేపదే ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ చీఫ్ హసన్ సలామీ ఇజ్రాయెల్‌కు వార్నింగ్స్ ఇస్తున్నారు. తాజాగా ఇవాళ కూడా ఆయన ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read :Diwali 2024 : అక్టోబరు 31 వర్సెస్ నవంబరు 1.. దీపావళి పండుగ తేదీపై గందరగోళం
‘‘మా దేశం (ఇరాన్)పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. వెంటనే మేం ప్రతిస్పందిస్తాం. మా ప్రతిస్పందన చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. దాన్నిచూసి ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుంది’’ అని ఇరాన్ ఐఆర్‌జీసీ చీఫ్ హసన్ సలామీ పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడి చేస్తే ఇజ్రాయెల్ పెద్ద పొరపాటు చేసినట్టు అవుతుందన్నారు. ఇరాన్ మిస్సైళ్ల శక్తియుక్తుల ముందు ఇజ్రాయెల్‌లో అమెరికా మోహరించిన థాడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఎందుకూ పనికి రాదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత సురక్షితంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వమే అవుతుందని హసన్ సలామీ తెలిపారు. ఇజ్రాయెల్ (Iran Vs Israel) బలహీనతలు ఏమిటో తమకు తెలుసని, వాటి ప్రకారమే దాడులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇటీవలే లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయిన ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో హసన్ సలామీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : India VS Canada : భారత్‌పై అక్కసు.. కెనడా ప్రధానికి ఖలిస్తానీ ఉగ్రవాది లేఖ వైరల్
మరోవైపు ఇజ్రాయెల్ దాడిని ఎదుర్కొనేందుకు ఇరాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రష్యాకు చెందిన ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను, చైనాకు చెందిన డ్రోన్లను కూల్చివేసే లేజర్ టెక్నాలజీ వ్యవస్థలను ఇరాన్ మోహరించింది. అణు కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అరబ్ దేశాల్లో పర్యటించి.. దౌత్యపరమైన మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ దేశంపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌కు షెల్టర్ ఇవ్వొద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆయా అరబ్ దేశాలను కోరుతున్నారు.