Interpol Silver Notice : తొలిసారిగా ఇంటర్‌పోల్ ‘సిల్వర్ నోటీసులు’.. ఏమిటివి ? ఇంకెన్ని నోటీసులుంటాయ్ ?
సిల్వర్ నోటీసులు జారీ చేయడాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇంటర్ పోల్(Interpol Silver Notice) చేపట్టింది.
- By Pasha Published Date - 06:20 PM, Fri - 10 January 25

Interpol Silver Notice : ‘ఇంటర్ పోల్’ అనే పదాన్ని తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. ఇంటర్ పోల్ అంటే అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ. ప్రపంచ దేశాల పోలీసు విభాగాలు సమన్వయం చేసుకునే వేదిక ఇది. ఇంటర్‌పోల్‌లో భారత్ సహా 196 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇంటర్‌పోల్ వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా 9 రకాల నోటీసులను జారీ చేస్తుంటుంది. తాజాగా తొలిసారిగా సిల్వర్ నోటీసులను ఇంటర్ పోల్ జారీ చేసింది. ఈసందర్భంగా వాటి గురించి, వివిధ రకాల ఇంటర్ పోల్ నోటీసుల గురించి తెలుసుకుందాం..
Also Read :Black Warrant : నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘బ్లాక్ వారెంట్’.. స్టోరీ ఏమిటో తెలుసా ?
తొలిసారిగా సిల్వర్ నోటీస్.. ఎందుకు ?
సిల్వర్ నోటీసును తొలిసారిగా ఇంటర్ పోల్ జారీ చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇప్పుడు దాన్ని ఎందుకు జారీ చేశారు అంటే.. ఒక మాఫియా సభ్యుడి ఆస్తులకు సంబంధించి ఇటలీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వీటిని జారీ చేశారు. ఏదైనా దేశానికి చెందిన నేరగాళ్లకు విదేశాల్లో ఆస్తులు ఉంటే వాటిని గుర్తించే ప్రక్రియలో ఈ నోటీసులు దోహదం చేస్తాయి. సిల్వర్ నోటీసులు జారీ చేయడాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇంటర్ పోల్(Interpol Silver Notice) చేపట్టింది. ఇందులో భాగంగా మోసం, అవినీతి, డ్రగ్స్ స్మగ్లింగ్, ఇతరత్రా తీవ్ర నేరాలతో సంబంధమున్న వారికి వివిధ దేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని గుర్తించి, ఆయా దేశాలకు అందించనుంది.
Also Read :One Student One Teacher : ఈ స్కూలులో ‘‘ఒకే విద్యార్థి.. ఒకే టీచర్’’.. వార్తలకెక్కిన నారపనేనిపల్లి
భారత్ నుంచి పరారీలో 10 మంది
ఇంటర్ పోల్ చేపట్టిన సిల్వర్ నోటీసుల పైలట్ ప్రాజెక్టులో మన భారతదేశం కూడా భాగంగా ఉంది. మన దేశం నుంచి దాదాపు 10 మంది ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయారు. వారు విదేశాలకు అక్రమంగా తీసుకెళ్లిన బ్లాక్ మనీ చిట్టాను విప్పేందుకు సిల్వర్ నోటీసులు దోహదం చేయనున్నాయి. ఇంటర్ పోల్‌తో భారతదేశ దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల సమన్వయాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇటీవలే ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఇంటర్ పోల్ ఇతర నోటీసులివీ..
- రెడ్ నోటీస్ : పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు లేదా దోషులుగా తేలిన వారు విదేశాలకు పరార్ అవుతుంటారు. అలాంటి వారి లొకేషన్‌ను గుర్తించి, అరెస్టు చేసేందుకు రెడ్ నోటీస్‌ను ఇంటర్ పోల్ జారీ చేస్తుంటుంది.
- ఎల్లో నోటీస్ : ఆచూకీ తప్పిన వాళ్ల లొకేషన్‌ను గుర్తించేందుకు ఎల్లో నోటీసును ఇంటర్ పోల్ జారీ చేస్తుంది.
- బ్లూ నోటీసు : నేర దర్యాప్తులో భాగంగా ఎవరైనా వ్యక్తి సమాచారాన్ని, లొకేషన్‌ను, కార్యకలాపాల వివరాలను రాబట్టేందుకు ఇంటర్ పోల్ బ్లూ నోటీసును జారీ చేస్తుంది.
- బ్లాక్ నోటీసు : గుర్తు తెలియని డెడ్‌బాడీలను గుర్తించేందుకు అవసరమైన సమాచారాన్ని కోరేందుకు బ్లాక్ నోటీసును ఇంటర్ పోల్ జారీ చేస్తుంది.
- గ్రీన్ నోటీసు : ప్రజాభద్రతకు ముప్పుగా మారిన వ్యక్తుల నేరపూరిత కార్యకలాపాల సమాచారంతో కూడిన హెచ్చరికను జారీ చేసేందుకు గ్రీన్ నోటీసును ఇష్యూ చేస్తారు.
- ఆరెంజ్ నోటీసు : ప్రజాభద్రతకు తక్షణ ముప్పుగా పరిణమిస్తున్న వ్యక్తి, కార్యక్రమం, వస్తువు, ప్రక్రియలపై సమాచారంతో హెచ్చరికను జారీ చేసేందుకు ఆరెంజ్ నోటీసును ఇష్యూ చేస్తారు.
- పర్పుల్ నోటీసు : నేరగాళ్లు అనుసరిస్తున్న పద్ధతులు, వారి లక్ష్యాలు, ఉపయోగిస్తున్న పరికరాలు, టెక్నిక్‌ల వివరాలను కోరుతూ లేదా అందిస్తూ జారీ చేసేదే పర్పుల్ నోటీసు.
- ఇంటర్ పోల్ – యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీసు : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలను ఉద్దేశించి ఈ నోటీసును జారీ చేస్తుంటారు.