One Student One Teacher : ఈ స్కూలులో ‘‘ఒకే విద్యార్థి.. ఒకే టీచర్’’.. వార్తలకెక్కిన నారపనేనిపల్లి
విద్యార్థిని కీర్తన మనసులోని మాట మరోలా ఉంది. ‘‘మా ఊరిలో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల(One Student One Teacher) ఇది.
- By Pasha Published Date - 03:03 PM, Fri - 10 January 25

One Student One Teacher : తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామం ఇటీవలే వార్తలకు ఎక్కింది. దీనికి కారణం.. ఆ ఊరిలోని ఏకోపాధ్యాయ, ఏక విద్యార్థి ప్రభుత్వ పాఠశాల. ఔను.. మీరు చదివింది నిజమే.. ఈ స్కూలులో ఒక టీచర్, ఒక స్టూడెంట్ మాత్రమే ఉన్నారు. అయినా ప్రతిరోజూ విద్యాబోధన కొనసాగుతోంది. ఒక విద్యార్థి మాత్రమే చదువుకుంటున్న ఈ పాఠశాల నిర్వహణకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఏటా రూ.12 లక్షల దాకా ఖర్చు చేస్తోంది. నారపనేనిపల్లి గవర్నమెంటు స్కూలులో చదువుకుంటున్న ఒక్కగానొక్క విద్యార్థిని పేరు కీర్తన. ఆమె వయసు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతోంది. ఆమెకు చదువు చెప్పేందుకు టీచర్ ఉమా పార్వతి ప్రతిరోజూ స్కూలుకు వస్తున్నారు. పాఠశాలలో కీర్తన ఒంటరిగా చదవడం వల్ల కలిగే సామాజిక, మానసిక ప్రతికూల ప్రభావాలను నివారించడానికి టీచర్ ఉమా పార్వతి కొన్ని సృజనాత్మక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు.
Also Read :Sankranti Effect : విమానాల రేంజులో ఏసీ స్లీపర్ బస్సుల టికెట్ల ధరలు.. ఎంతో తెలుసా ?
నెటిజన్ల నడుమ చర్చ
ఈ అంశంపై ఇంటర్నెట్‌లోనూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ‘‘విద్యార్థిని కీర్తన లక్కీ. వ్యక్తిగతంగా ఒక ఉపాధ్యాయురాలితో చదువు చెప్పించుకునే అరుదైన అవకాశం లభించింది’’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘కీర్తనకు బ్యాడ్ లక్.. తోటి విద్యార్థులు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్’’ అని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
కీర్తన, ఆమె తండ్రి ఏం చెప్పారంటే..
విద్యార్థిని కీర్తన మనసులోని మాట మరోలా ఉంది. ‘‘మా ఊరిలో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల(One Student One Teacher) ఇది. ఒక్కసారి మా ఊరిలో స్కూలు మూతపడితే మళ్లీ తెరిపించడం చాలా కష్టతరం అవుతుంది. అందుకే మా నాన్న నన్ను ఇందులోనే చదివిస్తున్నారు. ఏడో తరగతి అయ్యే దాకా నేను నారపనేనిపల్లి గవర్నమెంటు బడిలోనే చదువుతా. ఆ తర్వాత ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేరి చదువుకుంటాను’’ అని కీర్తన చెప్పుకొచ్చింది. తన తండ్రి సదభిప్రాయాన్ని ఆమె చాలా బాగా అర్థం చేసుకుంది. తాను గవర్నమెంటు స్కూలులో చదువుకోవడం వల్ల ఊరికి మేలు జరుగుతుందని ఆమె స్వయంగా చెప్పడం చాలా గొప్ప విషయం. కీర్తన తండ్రి అనిల్ శర్మ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
టీచర్ ఉమ ఏమన్నారంటే..
కీర్తనకు పాఠాలు చెబుతున్న టీచర్ ఉమ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు 10 మంది ఉన్నా.. 20 మంది ఉన్నా.. ఒక్కరే ఉన్నా.. విద్యాబోధన అనేది ఒకేలా ఉంటుంది. కాకపోతే టీచర్‌పై నిర్వహణ భారం కొంత తగ్గుతుంది’’ అని తెలిపారు.
Also Read :Rs 200 Crores Electricity Bill : రూ.200 కోట్ల కరెంటు బిల్లు.. నోరెళ్లబెట్టిన చిరువ్యాపారి
70 మంది విద్యార్థులు.. 24 మంది విద్యార్థులు.. 1 విద్యార్థి
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. నారపనేనిపల్లి గ్రామంలోని గవర్నమెంటు స్కూలులో 15 ఏళ్ల క్రితం దాదాపు 70 మంది విద్యార్థులు ఉండేవారు. గ్రామంలో ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరగడంతో వాటిలోకే చాలామంది విద్యార్థులు చేరిపోయారు. దీంతో గవర్నమెంటు స్కూలులోని విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. నాలుగో తరగతి దాకా ఊరిలోని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో పిల్లలను చదివించి, ఆ తర్వాత వారిని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగడం అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. టీచర్ ఉమా పార్వతి గత ఆరేళ్లుగా నారపనేనిపల్లి ప్రభుత్వ స్కూలులో పనిచేస్తున్నారు. ఆమె ఈ పాఠశాలలో విధుల్లో చేరే సమయానికి 24 మంది విద్యార్థులు ఉండేవారట. వారంతా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోకి వెళ్లిపోయారు. వచ్చే విద్యాసంవత్సరంలో నారపనేనిపల్లి ప్రభుత్వ స్కూలులోకి కనీసం 25 మంది పిల్లలను చేర్పించాలనే టార్గెట్‌తో జిల్లా విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ‘వీ కెన్ లెర్న్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక విద్యార్థుల్లో ఉచితంగా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచుతున్నారు.
ఖమ్మం డీఈఓ ఏమన్నారంటే..
ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సోమశేఖర్ దీనిపై స్పందించారు. ఒక్క విద్యార్థి కోసం పాఠశాల కొనసాగించడం చాలా కష్టసాధ్యమన్నారు. అయినా ఆ విద్యార్థిని విద్యను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న సరైన ప్రత్యామ్నాయాలను వెతకాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలను సమర్థవంతంగా ఉపయోగించుకునే మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.
నారపనేనిపల్లి సర్పంచ్ స్పందన ఇదీ..
ఒకే విద్యార్థి ఉన్నా ప్రభుత్వ పాఠశాల కొనసాగుతుండటాన్ని చూసి గ్రామ ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని నారపనేనిపల్లి సర్పంచ్ రవీందర్ రావు తెలిపారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా నిధులను తీసుకురావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చాలి. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకురావాలి. తద్వారా అడ్మిషన్లను పెంచొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.