US : అమెరికాలో హైదరాబాద్ వాసి దారుణ హత్య
US : ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్కు వచ్చాడు. ఈ క్రమంలో ఏదో వాగ్వాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు
- By Sudheer Published Date - 07:05 PM, Sat - 4 October 25

అమెరికాలో మరో తెలుగు తేజం మృతి చెందాడు. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ (Chandra Sekhar) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్‌లో నివసిస్తున్నారు. చదువుతోపాటు జీవన ఖర్చులు, ఫీజులు తీర్చుకోవడానికి ఆయన స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని దారుణంగా ముగించింది.
Ramreddy Damodar Reddy : ముగిసిన దామోదర్ రెడ్డి అంత్యక్రియలు
ప్రాథమిక సమాచారం ప్రకారం..ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్కు వచ్చాడు. ఈ క్రమంలో ఏదో వాగ్వాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆ దుండగుడు చంద్రశేఖర్‌పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడికక్కడే చంపేశాడు. అమెరికా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హత్యకు గల అసలు కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
ఈ ఘటనతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంతకాలంగా ఇలాంటి దాడులు, దోపిడీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలుగు యువతకు, వారి కుటుంబాలకు ఆందోళన పెరిగింది. చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కుటుంబం, స్నేహితులు, ప్రవాస సంఘాలు కృషి ప్రారంభించాయి. ఈ ఘటనతో తెలంగాణలోని ఆయన స్వగ్రామంలో శోకసంద్రం అలుముకుంది.