Floods In Pakistan : భారీ వర్షాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి..ఒక్కరోజులోనే 160 మంది మృతి
Floods In Pakistan : భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు, వాహనాలు, పాఠశాలలు, క్లినిక్‌లు కూడా ధ్వంసమయ్యాయి
- Author : Sudheer
Date : 15-08-2025 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర భారతదేశంతో పాటు, పాకిస్తాన్(Pakistan ), పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోనూ భారీ వర్షాలు (Floods ) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ రెండు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే పాకిస్తాన్, పీఓకేలలో 160 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అనేక మందికి గాయాలు కాగా, వందల భవనాలు ధ్వంసమయ్యాయి. క్లౌడ్ బరస్ట్, ఉరుములు, మెరుపులతో ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారు.
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేలకు దూరం కానున్నాడా?
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య అత్యధికంగా నమోదైంది. బునేర్ జిల్లాలో 75 మంది, బాజౌర్ జిల్లాలో 18 మంది, బాటాగ్రామ్ జిల్లాలో 18 మంది, మాన్సెహ్రా జిల్లాలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రావిన్స్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి చిన్నారులతో సహా 125 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా చాలా మంది గల్లంతైనందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు, వాహనాలు, పాఠశాలలు, క్లినిక్‌లు కూడా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలు, ఆర్మీ, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా నీలం వ్యాలీలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రకృతి విపత్తు వల్ల ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది, ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది.