Earthquake: టర్కీ, సిరియా లో భూకంపం. భారీగా పెరిగిన మృతుల సంఖ్య..
తెల్లవారుజామున టర్కీ (Turkey), సిరియా దేశాల్లో సంభవించిన అతి భారీ భూకంపం వందల మందిని బలి తీసుకుంది.
- By Maheswara Rao Nadella Published Date - 02:55 PM, Mon - 6 February 23

తెల్లవారుజామున టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన అతి భారీ భూకంపం (Earthquake). వందల మందిని బలి తీసుకుంది. వేలాది మంది కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి ఎన్నో భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో 245 మందికిపైగా, టర్కీలో 284 మందికి పైగా చనిపోయారు. గంటలు గడిచే కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
భూకంపం (Earthquake) దెబ్బకి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. కొన్ని చోట్ల పూర్తిగా నేలమట్టమయ్యాయి. రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపిస్తున్నాయి. టర్కీలో 2,300 మందికి పైగా గాయపడ్డారని, పలు ప్రధాన నగరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దేశ వైస్ ప్రెసిడెంట్ ఫువత్ ఒక్టేయ్ చెప్పారు.
చలికాలం కావడంతో రోడ్లన్నీ మంచుతో కప్పుకుని ఉన్నాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ భూకంపం తర్వాత కూడా 40కి పైగా ప్రకంపనలు వచ్చాయి. మరిన్ని వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.
Also Read: Mayor Election: మళ్లీ వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక