Trump Truth Social : ట్రంప్ కంపెనీ సీఈఓకు కూడా ప్రభుత్వంలో పదవి.. ఎందుకు ?
ట్రూత్ సోషల్ సీఈఓ డెవిన్ న్యూన్స్‌కు ప్రెసిడెంట్ ఇంటెలీజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా(Trump Truth Social) బాధ్యతలను అప్పగించారు.
- Author : Pasha
Date : 15-12-2024 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Truth Social : డొనాల్డ్ ట్రంప్ .. ఇప్పుడు ఒక సోషల్ మీడియా కంపెనీకి అధినేత కూడా!! ఆయన సోషల్ మీడియా కంపెనీ పేరు ‘ట్రూత్ సోషల్’. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఆయన ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ట్రంప్‌పై కేసులు నమోదు కావడంతో ఆయనను ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు బ్లాక్ చేశాయి. దీంతో ట్రూత్ సోషల్ పేరుతో తాను సొంతంగా ఒక సోషల్ మీడియా కంపెనీని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దానికి సీఈఓగా డెవిన్ న్యూన్స్ వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ కోసం బలమైన ప్రచారం చేయడంలో డెవిన్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు కూడా తన ప్రభుత్వంలో ఒక పదవిని ట్రంప్ కేటాయించారు.
Also Read :Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
ట్రూత్ సోషల్ సీఈఓ డెవిన్ న్యూన్స్‌కు ప్రెసిడెంట్ ఇంటెలీజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా(Trump Truth Social) బాధ్యతలను అప్పగించారు. ఈవిషయాన్ని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ప్రెసిడెంట్ ఇంటెలీజెన్స్ అడ్వైజరీ బోర్డు వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో అమెరికా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. దీన్ని 1956 సంవత్సరంలో స్థాపించారు. అమెరికా జాతీయ ఇంటెలీజెన్స్ అవసరాలను తీర్చడమే దీని పని. అమెరికా ఏజెన్సీల సామర్థ్యంపై ఇది ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తుంది. ఈవిషయాన్ని దేశ అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటుంది.
Also Read :Name Correction : టెన్త్ సర్టిఫికెట్లో మీ పేరు తప్పుపడిందా ? ఇలా చేయండి
గతంలో హౌస్ ఇంటెలీజెన్స్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం న్యూన్స్‌కు ఉంది. 2015 నుంచి 2019 వరకు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందించారు. అప్పట్లో రష్యాకు సంబంధించిన బూటకపు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కొంతకాలం పాటు న్యూన్స్.. కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించారు. ట్రూత్ సోషల్ కోసం పనిచేసేందుకుగానూ 2019లో అమెరికా కాంగ్రెస్‌కు డెవిన్ న్యూన్స్ రాజీనామా చేశారు. ఈ కారణాల వల్లే తన ప్రభుత్వంలో ఈసారి న్యూన్స్‌కు అవకాశం ఇచ్చానని ట్రంప్ వెల్లడించారు.