Trump Buyouts Offer : 8 నెలల శాలరీ ఇస్తా.. జాబ్ వదిలేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్
ట్రంప్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్‌ను దాదాపు 10 నుంచి 15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు(Trump Buyouts Offer) ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు.
- By Pasha Published Date - 11:59 AM, Wed - 29 January 25

Trump Buyouts Offer : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్‌ను ప్రకటించారు. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల శాలరీని ఏకకాలంలో చెల్లిస్తామని వెల్లడించారు. వచ్చే వారం (ఫిబ్రవరి 6)లోగా దీనిపై ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. ఉద్యోగాలను మానేద్దామని భావించేవారు ఈ ఆఫర్‌ను ఎంచుకోవచ్చన్నారు. ఈమేరకు అమెరికా ప్రభుత్వం ఒక అధికారిక మెమోను జారీ చేసింది. దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈమెయిల్‌ను పంపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ (డోజ్) సలహా మేరకే ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్లు తెలిసింది. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం, వైమానిక రంగం, నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తారని సమాచారం. ట్రంప్ ఇచ్చిన బై అవుట్ ఆఫర్‌ను దాదాపు 10 నుంచి 15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు(Trump Buyouts Offer) ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొంతవరకు విజయవంతమైనా అమెరికా ప్రభుత్వ వార్షిక ఖర్చులు 100 బిలియన్ డాలర్ల దాకా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read :Telangana Land Prices : తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. ఎంత ?
మొత్తం 30 లక్షల మంది..
- 2024 చివరి నాటికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
- అమెరికాలో ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్లపాటు పని చేస్తుంటారు.
- కరోనా సంక్షోభ కాలం నుంచి అమెరికాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు.
- ఇటీవలే ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే ఆఫీసుకు వచ్చి పనిచేయాలని వారందరికీ ఆదేశాలు జారీ చేశారు.
- ఆఫీసుకు వచ్చి పనిచేయలేని వారు బైఅవుట్ ఆఫర్‌ను వాడుకోవాలని ట్రంప్ తేల్చి చెప్పారు.
- ఇలాంటి వారిలో చాలామంది బైఅవుట్ ఆఫర్‌ను వినియోగించుకుంటారని తెలుస్తోంది. 8 నెలల శాలరీని ఏకకాలంలో తీసుకొని వెళ్లిపోతారని అంచనా వేస్తున్నారు.
- ఈ నిర్ణయాల వల్ల ఉద్యోగ వర్గాల నుంచి ట్రంప్‌కు వ్యతిరేక ఎదురుకావచ్చనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో అమెరికాలో ఉద్యోగుల సమ్మెలు జరగొచ్చని భావిస్తున్నారు.