Trump Called PM Modi: ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని మోదీ.. జర్మన్ పత్రిక సంచలన కథనం!
ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ పదేపదే ప్రధాని మోదీని బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక కథనంలో ఉంది. ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని ఆ నివేదిక తెలిపింది.
- By Gopichand Published Date - 08:41 PM, Tue - 26 August 25

Trump Called PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌ను ప్రకటించినప్పటి నుండి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ జర్మన్ వార్తాపత్రిక FAZ (Frankfurter Allgemeine Zeitung) ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. టారిఫ్ వివాదం తర్వాత ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాలుగు సార్లు ఫోన్ (Trump Called PM Modi) చేసినా.. మోదీ ఆయనతో మాట్లాడటానికి నిరాకరించారని ఆ పత్రిక పేర్కొంది.
నాలుగు సార్లు ట్రంప్ ఫోన్ కాల్
జర్మన్ వార్తాపత్రిక FAZ ప్రకారం.. భారత్‌ను “చనిపోయిన ఆర్థిక వ్యవస్థ” అని ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోడీ తీవ్రంగా ఆగ్రహం చెందారు. ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల గత 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. బ్రెజిల్ తర్వాత భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్ అత్యధికం. అంతేకాకుండా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు కూడా అమెరికా భారత్‌పై జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటీవలి వారాల్లో నాలుగు సార్లు ప్రధాని మోదీకి ఫోన్ చేసినా ఆయన మాట్లాడటానికి నిరాకరించారని FAZ పేర్కొంది.
Also Read: AP Bar License: బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పెంచిన ఏపీ ప్రభుత్వం
ట్రంప్‌పై మోదీ ఆగ్రహానికి కారణం ఏమిటి?
జూలై 31న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “భారత్ రష్యాతో ఏం చేస్తుందో నాకు పట్టదు. వారు ఇద్దరూ కలిసి తమ చనిపోయిన ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోగలరు. మేము భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేశాం. వారి టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ ఒకటి” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని జర్మన్ పత్రిక పేర్కొంది.
ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ పదేపదే ప్రధాని మోదీని బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక కథనంలో ఉంది. ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని ఆ నివేదిక తెలిపింది. అమెరికా వ్యవసాయ రంగం కోసం భారత మార్కెట్లను తెరవాలని ట్రంప్ చేస్తున్న ఒత్తిడిని కూడా ప్రధాని మోదీ వ్యతిరేకిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించడానికి నోటీసు జారీ చేశారు. కొత్త టారిఫ్ వ్యవస్థ ఆగస్టు 27 అర్థరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు.