China : బీజింగ్లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై
China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు.
- By Kavya Krishna Published Date - 01:03 PM, Wed - 3 September 25

China : చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం అద్భుతమైన సైనిక కవాతు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. చైనాలో ఇప్పటివరకు జరిగిన కవాతుల్లో ఇది అత్యంత భారీగా, శక్తి ప్రదర్శనతో కూడినదిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని 25 దేశాల ప్రధాన నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వేదికపై ఒకే వేదికను పంచుకోవడం అంతర్జాతీయంగా విశేష చర్చనీయాంశమైంది. వీరితో పాటు అనేక దేశాధినేతలు, రక్షణ మంత్రులు, సైనిక ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
కవాతులో చైనా తొలిసారిగా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, రక్షణ వ్యవస్థలును ప్రదర్శించింది. దీనివల్ల చైనా తన రక్షణ రంగంలో సాధించిన సాంకేతిక ప్రగతిని ప్రపంచానికి చూపించింది. “మేము శాంతి కోరుతున్నాం, కానీ దేశ రక్షణ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం” అనే సందేశాన్ని చైనా ఈ కవాతుతో అంతర్జాతీయ సమాజానికి చేరవేయాలనుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు
ఈ కవాతుకు హాజరయ్యేందుకు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ రైలులో బీజింగ్ చేరుకున్నారు. కొంతమంది సీనియర్ అధికారులతో కలిసి ఆయన చేసిన ఈ ప్రయాణం విశేష ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా, 2023 తర్వాత కిమ్ దేశం విడిచి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా, దాని మిత్రదేశాల ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా, చైనా–రష్యా మద్దతును బలోపేతం చేసుకోవాలని చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.
తాజాగా కిమ్, రష్యాకు సైనికులను పంపించడం కూడా ఇదే వ్యూహంలో భాగంగా జరుగుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాతో పాటు చైనా మద్దతు మరింత బలపడితే, ఉత్తర కొరియాకు అమెరికా ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. కవాతు సందర్భంగా మరో ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిశారు.
షీల్డ్ మార్షల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మునీర్ తొలిసారి జిన్‌పింగ్‌ను కలవడం విశేషం. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, ఆర్థిక సంబంధాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ కవాతు కేవలం చైనా సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాకుండా, జియోపాలిటికల్ దృష్ట్యా ఒక కీలక సందేశం అని నిపుణులు భావిస్తున్నారు. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై ఉండడం ద్వారా అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య దేశాలకు ఒక ప్రత్యామ్నాయ శక్తి బ్లాక్ ఉన్నదనే సంకేతం వెలువడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Kavitha Suspended : కవిత సస్పెండ్.. BRS కు మరింత నష్టం జరగబోతుందా..?