Kavitha Suspended : కవిత సస్పెండ్.. BRS కు మరింత నష్టం జరగబోతుందా..?
Kavitha Suspended : ఇప్పటికే ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు, కవిత వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది
- By Sudheer Published Date - 06:30 PM, Tue - 2 September 25

రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన వరుస ఎదురుదెబ్బలు, ఆపై కవిత సస్పెన్షన్, ఆమె చేసిన సంచలన ఆరోపణలు పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు, కవిత వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కవిత ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలని కొట్టిపారేయడానికి వీలు లేదని, వాటిలో నిజం ఎంత ఉందనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకత్వం ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హరీష్ రావును గుడ్డిగా నమ్ముతున్నారా, లేక కవిత ఆరోపణల్లో నిజం ఉంది కాబట్టే వారు మౌనం పాటిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా కవిత కీలక ఆరోపణలు చేస్తున్నప్పటికీ, పార్టీ అధిష్టానం వాటిని ఎందుకు ఖండించలేదనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరిందని స్పష్టం చేస్తోంది.
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !
కవిత సస్పెన్షన్, ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వరుస ఎన్నికల ఓటములతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలోని కీలక నాయకురాలిపై చర్యలు తీసుకోవడం, ఆమె పార్టీపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. పార్టీలో కవితకు తీవ్ర అన్యాయం జరిగిందనే భావన ఆమె అభిమానుల్లో, కొంతమంది పార్టీ నాయకుల్లో కలిగింది. ఇది పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది.
మరోవైపు కవిత ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా ఒక అస్త్రంగా మారాయి. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని, నాయకత్వం మధ్య సమన్వయం లేదని కవిత ఆరోపణల ద్వారా స్పష్టమైందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురవుతున్న కేసులు, ఇప్పుడు కవిత వ్యవహారం కాంగ్రెస్ కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరోపక్క కవిత కొత్త పార్టీ పెట్టె అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. కవిత కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా బిఆర్ఎస్ ఓట్ల ను చీల్చడం ఖాయం..ఇది బిఆర్ఎస్ కు నష్టం..కాంగ్రెస్ కు లాభం గా మారే అవకాశం ఉంది. మరి ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.