Afghanistan: అప్ఘనిస్థాన్ లో మరో కొత్త రూల్.. పార్కుల్లోకి మహిళలకు నో ఎంట్రీ..!
అప్ఘనిస్థాన్ లో పాలనను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై నిరంతరం కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
- Author : Gopichand
Date : 11-11-2022 - 2:21 IST
Published By : Hashtagu Telugu Desk
అప్ఘనిస్థాన్ లో పాలనను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై నిరంతరం కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే పలు ఆంక్షలతో మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేసిన తాలిబన్లు మరో కొత్త నిబంధన తీసుకొచ్చారు. పార్కులు, జిమ్‌లలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహిళల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అఫ్గాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక మహిళలపై ఇలాంటి ఆంక్షలు చాలా ఎక్కువయ్యాయి. విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. మగవారు లేకుండా అక్కడి మహిళలు బయటకు రావటానికి అవకాశం లేదు. అలాగే హిజాబ్ ధరించాలి. బాలికల చదువుపైనా నియంత్రణ విధిస్తున్నారు. అఫ్గాన్ లో చాలా ప్రాంతాల్లో టీనేజ్ బాలికల కోసం పాఠశాలలు కూడా ఒక సంవత్సరం పాటు మూసివేయబడ్డాయి. కొన్ని కార్యాలయాలలో మహిళలు పని చేయడం కూడా నిషేధం విధించారు.