Earthquake : అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
భూకంప కేంద్రం సాండ్ పాయింట్ అనే ద్వీప పట్టణానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని అంచనా వేసిన జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం, పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాలకు తక్షణమే హెచ్చరికలు జారీ చేసింది.
- By Latha Suma Published Date - 11:02 AM, Thu - 17 July 25

Earthquake : అమెరికాలోని అలాస్కా తీర ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. ఈ ప్రకంపనలతో దక్షిణ అలాస్కా మరియు సమీప ద్వీప ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం బుధవారం మధ్యాహ్నం 12:37 గంటలకు (స్థానిక కాలమానం) సంభవించింది. భూకంప కేంద్రం సాండ్ పాయింట్ అనే ద్వీప పట్టణానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని అంచనా వేసిన జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం, పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాలకు తక్షణమే హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు దక్షిణంగా 40 మైళ్లు) నుండి యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు ఈశాన్యంగా 80 మైళ్లు) వరకు ఉన్న తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: HYD : హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరాకు నూతన శకం..ఇక ఆ బాధలు తీరినట్లే
సముద్రపు అలల ఉధృతిని నిరంతరం గమనిస్తున్న నిపుణులు, రాబోయే గంటల్లో తీరప్రాంతాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనితోపాటు, తీరప్రాంత ప్రజలకు తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ స్థానిక అధికార యంత్రాంగం హెలికాప్టర్లు, సముద్ర గస్తీ బృందాలను అప్రమత్తం చేసింది. అలాస్కా ప్రాంతం భూకంపాలకు అత్యంత ప్రభావిత ప్రాంతం. ఇది పసిఫిక్ ‘ఫైర్ రింగ్’లో భాగంగా ఉంది. ఇదే ప్రాంతంలో గతంలోనూ పలు తీవ్ర భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో తీవ్రంగా దెబ్బతింది. అది ఉత్తర అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపంగా నిలిచింది. ఆ భూకంపం కారణంగా ఆంకరేజ్ నగరం నానాడిగా శిథిలమైంది. అంతేకాక, అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరంతోపాటు హవాయి ద్వీపాలను సునామీ ముంచెత్తింది. దాని ధాటికి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.
ఇప్పుడు సంభవించిన తాజా భూకంపంతో ప్రజలు ఆ ఘోర సంఘటనను మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. అప్పటి నష్టం ఇప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రకృతి విపత్తు సంభవించనిదీ అని ఆశిస్తున్నాం అని స్థానిక నివాసి ఒకరు మీడియాతో తెలిపారు. ఇక అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసింది. ప్రాధమిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటి వరకు ప్రాణ నష్టం ఏదీ నమోదవలేదని అధికారులు చెప్పారు. అయినప్పటికీ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేయడమేకాకుండా, తీరప్రాంత ప్రజలకు రక్షిత ప్రాంతాలకు తరలింపునకు ఏర్పాట్లు చేపట్టారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున, ప్రజలెవ్వరూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.