Libya Floods: లిబియాలో విధ్వంసం.. 5,300 దాటిన మృతుల సంఖ్య, 10 వేల మందికి పైగా గల్లంతు..!
ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు (Libya Floods) భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది.
- By Gopichand Published Date - 10:37 AM, Wed - 13 September 23

Libya Floods: ఆఫ్రికన్ దేశమైన లిబియాలో తుఫాను, వరదలు (Libya Floods) భయంకరమైన విధ్వంసం సృష్టించాయి. డేనియల్ తుపాను విధ్వంసకర వరదలకు కారణమైంది. ‘డేనియల్’ తుఫాను తర్వాత సంభవించిన వరద ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో విధ్వంసం సృష్టించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 5300 మందికి పైగా మరణించగా, పది వేల మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అల్జరీరా నివేదిక ప్రకారం.. డెర్నా నగరం పూర్తిగా ధ్వంసమైన లిబియా తూర్పు ప్రాంతంలో వరదల వినాశనం కనిపించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ అబు-లమోషా ప్రకారం డెర్నాలో మరణించిన వారి సంఖ్య 5,300 దాటింది.
CNN నివేదిక ప్రకారం.. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లోని రెండు డ్యామ్‌లు తెగిపోవడంతో నీటి ప్రవాహానికి దారితీసింది. దీనిలో వేలాది మంది ప్రజలు కొట్టుకుపోయారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ కనిపించకుండా పోయారు. డెర్నా నగరంలో నాలుగో వంతు ధ్వంసమైందని చెబుతున్నారు. వరదల కారణంగా 10 వేల మంది తప్పిపోయారని, ఆసుపత్రులు మృతదేహాలతో నిండిపోయాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, టెడ్ క్రెసెంట్ సొసైటీల లిబియా రాయబారి తామెర్ రంజాన్ చెప్పారు.
డేనియల్ తుఫాను సృష్టించిన బీభత్సంతో డెర్నాలో భారీ వినాశనం చోటు చేసుకుందని.. ఇప్పుడు ఈ నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించినట్లు తెలిపారు. లిబియా తూర్పు పార్లమెంటు-మద్దతుగల పరిపాలన అధిపతి ఒసామా హమద్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. కుండపోత వర్షాల కారణంగా లిబియాలో పరిస్థితి భయంకరంగా ఉందని ఒసామా తెలిపారు. తుఫాన్, వదల కారణంగా అనేక కార్లు నీటిలో మునిగాయి. భవనాలు కుప్పకూలాయి. రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. లిబియా తాజాగా పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఒసామా హమద్ తెలిపారు.