Shooting At Protesters: ఇరాన్ లో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
ఇరాన్‌లోని హిజాబ్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం, సైన్యం అణచివేస్తున్నసంగతి తెలిసిందే.
- By Gopichand Published Date - 10:58 AM, Thu - 17 November 22

ఇరాన్‌లోని హిజాబ్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం, సైన్యం అణచివేస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని లేజ్ నగరంలో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక ర్యాలీపై గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో 2 మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు.
ఇరాన్ నైరుతి నగరమైన లేజ్ బీచ్ మార్కెట్‌లో ముష్కరులు కాల్పులు జరపడంతోఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో పలువురు పౌరులతో పాటు భద్రతలో ఉన్న సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ, ఓ బాలిక మృతి చెందినట్లు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది. దుండగులు ఎందుకు కాల్పులు జరిపారనేది ఇంకా తెలియరాలేదు.
ఈ కాల్పుల్లో భద్రతా బలగాలు సహా మరో పది మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒక బాలిక, ఒక మహిళ ఉన్నారని ఖుజెస్తాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ వలీవుల్లా హయాతి తెలిపారు. ఈ ఘటనకు ముందు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు డజన్ల కొద్దీ నిరసనకారుల బృందం బుధవారం అర్థరాత్రి లేజ్ లోని వివిధ ప్రాంతాలలో గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆపై పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఆ తర్వాత వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ను పోలీసులు కూడా విడుదల చేశారు.