Blast In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి
ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది.
- By Gopichand Published Date - 06:31 PM, Wed - 30 November 22

ఆఫ్ఘానిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. పిల్లలు, సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని సమంగాన్ ప్రావిన్స్‌లోని ఐబాక్ నగరంలోని జహ్దియా మదర్సాలో బుధవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 16 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. మధ్యాహ్న ప్రార్థనల తర్వాత పేలుడు సంభవించిందని, ప్రావిన్షియల్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు తెలిపాడు.
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని మదర్సాలో జరిగిన బాంబు పేలుడులో కనీసం పది మంది విద్యార్థులు మరణించారని తాలిబాన్ అధికారి ఒకరు చెప్పారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. పేలుడుకు సంబంధించి భద్రతా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పేలుడు తర్వాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 15 ఆగస్టు 2021 నుండి ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబాన్ నియంత్రణలో ఉంది. దేశంలో శాంతి నెలకొందని తాలిబాన్‌లు నిరంతరం వాదిస్తున్నప్పటికీ దాడుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
తాజాగా.. ఆఫ్ఘనిస్థాన్‌లో మోర్టార్ షెల్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన ప్రకారం ఈ పేలుడు ఉగ్రవాద దాడి కాదని తెలిపింది. తాలిబాన్ల నిర్ణయాల వల్ల ప్రపంచదేశాలు ఆఫ్ఘానిస్తాన్ కు సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో అక్కడ విపరీతమైన పేదరికం ఏర్పడింది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో డ్యూరాండ్ రేఖపై స్పష్టత లేకపోవడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి.