Maldives fire: మాలే మంటల్లో 8 మంది భారతీయులు మృతి.!
మాల్దీవుల రాజధాని మాలేలో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 02:45 PM, Thu - 10 November 22

మాల్దీవుల రాజధాని మాలేలో గురువారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ గ్యారేజీలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈప్రమాదంలో దాదాపు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.
మాల్దీవుల రాజధాని నగరం మాలేలో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు సహా 10 మంది మరణించారు. వలస కార్మికులు నివసించే భవనం పై అంతస్తు నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని వాహన మరమ్మతు గ్యారేజీ నుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. కాగా.. మృతి చెందిన వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం అందిందని భారత హైకమిషన్ తెలిపింది.
“మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉంది. మేము మాల్దీవుల అధికారులతో మాట్లాడుతున్నాం ”అని భారత హైకమిషన్ ట్విట్టర్‌లో పేర్కొంది. అక్కడ వారు సహాయం కోసం +9607361452 లేదా +9607790701 నంబర్లను సంప్రదించవచ్చని హైకమిషన్ పేర్కొంది. సమీపంలోని స్టేడియంలో తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మాల్దీవుల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. “మాలేలో అగ్నిప్రమాదం వల్ల నిరాశ్రయులైన, ప్రభావితమైన వారి కోసం మాఫన్నూ స్టేడియంలో ఎన్‌డిఎంఎ తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సహాయ సహకారాలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాల్దీవుల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ట్వీట్‌లో పేర్కొంది.
We are deeply saddened by the tragic fire incident in Malé which has caused loss of lives, including reportedly of Indian nationals.
We are in close contact with the Maldivian authorities.
For any assistance, HCI can be reached on following numbers:
+9607361452 ; +9607790701— India in Maldives (@HCIMaldives) November 10, 2022