Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:32 PM, Wed - 15 October 25

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి పండగల నేపథ్యంలో.. ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి దీనిని 58 శాతానికి చేర్చింది. ఇక్కడ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా 3 శాతం పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 10,083.96 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం పొందుతారు. ఇది 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుందని చెప్పొచ్చు.
ఇప్పుడు 5వ వేతన సంఘం , 6వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా.. ప్రీ రివైజ్డ్ పే స్కేల్‌లో జీతాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది. 5వ వేతన సంఘం కింద అంతకుముందు డీఏ 252 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరో 5 శాతం పెరిగి 257 శాతానికి చేరింది. ఇంకా 6వ వేతన సంఘం కింద చూస్తే అంతకుముందు డీఏ 466 శాతంగా ఉండగా.. 8 శాతం పెరిగి 474 శాతానికి పెరిగింది. డీఏ అనేది బేసిక్ పే పై వర్తిస్తుంది.
ఇక్కడ కూడా 2025, జులై 1 నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుంది. పాత బకాయిలు కలిపి చెల్లిస్తారు. సాధారణంగా ఏటా రెండు సార్లు కేంద్రం డీఏ సవరిస్తుంటుంది. దీనిని మార్చిలో ప్రకటించి.. జనవరి 1 నుంచి అమలు చేస్తుంటుంది. మళ్లీ సెప్టెంబర్/అక్టోబరులో ప్రకటించి.. జులై 1 నుంచి అమలు చేస్తుంటుంది. ఈ ఉద్యోగులు.. సెంట్రల్ అటానమస్ బాడీస్ (CABs), సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSEలు) వంటి వాటిల్లో పనిచేస్తుంటారు.
ఉద్యోగికి రూ. 50 వేల బేసిక్ పే ఉంటే.. 5వ వేతన సంఘం కింద అంతకుముందు డీఏ 466 శాతం కింద ఇది రూ. 2,33,000 గా ఉండగా.. కొత్త రేటు 474 శాతం ప్రకారం అది రూ. 2,37,000 కు చేరుతుంది. ఇక్కడ బై హ్యాండ్ శాలరీ రూ. 4 వేలు పెరుగుతుంది. ఇదే 6వ వేతన సంఘం కింద చూస్తే.. 252 శాతం డీఏ ప్రకారం రూ. 1,26,000 గా ఉండగా.. ఇప్పుడు 257 శాతానికి చేరింది. ఇక్కడ టేక్ హోం శాలరీ రూ. 2500 పెరగనుంది