AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
- By Latha Suma Published Date - 11:42 AM, Wed - 5 March 25

AP Assembly : ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. అప్పుడు ప్రచారానికి తెరదించడానికి రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తాయి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
Read Also: SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అంటే కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసీ జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నా. అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులతో జగన్ నాకు గత ఏడాది జూన్ 24న లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.
తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించా. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు.. ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు? ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైకాపా సభ్యులను కోరుతున్నా అని స్పీకర్ పేర్కొన్నారు. జగన్ పిటిషన్ ఇప్పటికీ విచారణకు తీసుకోవాలా.. వద్దా అనే దశలోనే ఉంది. అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు.