CM Revanth Reddy : త్వరలోనే రైతు భరోసా ప్రారంభిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు.
- Author : Latha Suma
Date : 15-08-2024 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు గోల్కొండ కోటలో జరిగిన 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని కొంతమంది వక్రభాష్యం చెప్పారని, కానీ తాము అమలు చేసి చూపించామన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఫసల్బీమాలో చేరాలని నిర్ణయించామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, నేటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని ముఖ్యమంత్రి అన్నారు. అందెశ్రీ రాసిన గీతాన్ని తాము రాష్ట్ర గీతంగా ప్రకటించామని గుర్తు చేశారు. తమ సిద్ధాంతం గాంధేయవాదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. పదేళ్లలోనే తెలంగాణ అప్పు పది రెట్లు పెరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. తమ అమెరికా పర్యటనలో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామన్నారు. తక్కువ వడ్డీకే రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా అడుగులు వేయించిన దార్శనికుడు నెహ్రూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు. బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పామన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేసి ప్రతి పౌరుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. ఎల్బీ శాస్త్రీ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన హరిత విప్లవంతోనే ప్రపంచంలోనే అత్యధిక ఆహారధాన్యల ఉత్పత్తి మన వద్ద జరుగుతోందన్నారు.