Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్‌లో నిలిపివేయబడింది.
- By Latha Suma Published Date - 02:36 PM, Fri - 13 June 25

Vande Bharat : వేగంగా ప్రయాణించేందుకు గుర్తింపు పొందిన వందే భారత్ (Vande Bharat) రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి (Tirupati) వెళ్తున్న రైలు, నెల్లూరు (Nellore) రైల్వే స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. దీంతో రైలును అత్యవసరంగా స్టేషన్‌లో ఆపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్‌లో నిలిపివేయబడింది.
Read Also: Air India Plane Crash : ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను గుర్తించి, మరమ్మతులు చేపట్టారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించుతూ రైలులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా రైలును తిరుపతి దిశగా మళ్లిస్తాము అని స్పష్టం చేశారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని కోరారు. ఈ ఘటనపై ప్రయాణికుల మధ్య ఆందోళన నెలకొంది. వేగ రైలు అయిన వందే భారత్‌లో వరుసగా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రయాణికులు భద్రతపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో ఇటీవల కొన్ని అపరిచితులు వందే భారత్ రైపై రాళ్లు విసిరిన ఘటన మరువకముందే, ఇప్పుడు ఈ సాంకేతిక లోపం చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
ఆ సంఘటనలో రైలు అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు సాంకేతిక లోపం తలెత్తడం రైల్వే భద్రత, నిర్వహణపై సమగ్ర సమీక్ష అవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ముందస్తు పర్యవేక్షణ, సాంకేతికంగా సమగ్ర తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని, అప్పుడప్పుడు రైలుకు సంబంధించిన పరికరాల పని తీరును పరిశీలించాలని సూచిస్తున్నారు. రైల్వే సిబ్బందికి తగిన శిక్షణతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరింత అప్రమత్తంగా ఉండి, భద్రత ప్రమాణాల్లో లేకుండా ముందుకు సాగాలని ప్రయాణికుల విన్నపం.