Plane Crash : ఎలా బతికానో నాకే అర్థం కాలేదు..విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్.. ప్రమాద క్షణాలను గుర్తుచేస్తూ మీడియాతో అనుభవాలనుపంచుకున్నారు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అది భీకరంగా ఊగింది. నిమిషాల వ్యవధిలో అది ముక్కలైంది. నేను కూర్చున్న 11-ఏ సీటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. అది నా ప్రాణాలను రక్షించింది అని అన్నారు.
- By Latha Suma Published Date - 01:06 PM, Fri - 13 June 25

Plane Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనలో ఓ వ్యక్తి మాత్రం అద్భుతంగా మృత్యును జయించి బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బ్రిటన్ నివాసి అయిన విశ్వాస్‌కుమార్ రమేశ్ (Vishwash Kumar Ramesh) ఆ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిగా గుర్తించబడ్డారు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్.. ప్రమాద క్షణాలను గుర్తుచేస్తూ మీడియాతో అనుభవాలనుపంచుకున్నారు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అది భీకరంగా ఊగింది. నిమిషాల వ్యవధిలో అది ముక్కలైంది. నేను కూర్చున్న 11-ఏ సీటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. అది నా ప్రాణాలను రక్షించింది అని అన్నారు.
Read Also: Bomb Threat : బాంబు బెదిరింపు.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
నేను విమానం నుంచి దూకలేదు. కేవలం నా సీటు విరిగిపడి ముందుకు ఎగిరింది. విమానంలో చెలరేగిన మంటలు నాకు తాకలేకపోయాయి. చనిపోయానేమోనని భావించాను. కానీ కళ్లు తెరిచేసరికి ఓ శిథిల భవనంలో ఉన్నట్లు అనిపించింది. నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చా. ఎడమ చేయికి మంటల వల్ల గాయమైంది అని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలు గాయాలు కాగా, వాటికి చికిత్స పొందుతున్న విశ్వాస్ క్రమంగా కోలుకుంటున్నారు. డాక్టర్ల కథనం ప్రకారం ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదు. శుక్రవారం ఆయనను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రమాదంలో విశ్వాస్ విమానంలోని 241 మంది ప్రయాణీకుల మధ్య ఒక్కడే ప్రాణాలతో బయటపడటం మరింత విచిత్రంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆయన రక్తముగ్దుడిగా నడుచుకుంటూ అంబులెన్స్‌లోకి ఎక్కిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విశ్వాస్‌కుమార్ ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్నప్పటికీ, గుజరాత్‌లోని తన కుటుంబాన్ని కలవడానికి భారత్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో బీజే వైద్య కళాశాల వసతిగృహం శిథిలమై, అందులో 24 మంది మరణించారు. విశ్వాస్ మృత్యుపాశం నుంచి బయటపడిన ఈ ఘట్టం జీవితం ఎంత అనిశ్చితమైనదీ, అలాగే కొన్ని అద్భుతాలు నిజంగానే జరుగుతాయన్న భావనను ప్రజలందరిలో కలిగించింది. ఆయన ధైర్యం, సహనానికి ప్రతి ఒక్కరూ నివాళి అర్పిస్తున్నారు.
Read Also: Love Marriage : మారరా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని 40 మందికి గుండు.. పెద్ద కర్మ నిర్వహించి..