Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy letter to Revanth Reddy : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి ప్రస్తావిస్తూ..లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.
- By Latha Suma Published Date - 03:18 PM, Mon - 9 September 24

Kishan Reddy letter to Revanth Reddy : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ సీఎంకి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి ప్రస్తావిస్తూ..లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.. పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్‌లో పూర్తవుతోంది. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ తో పాటుగా లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. నగరంలో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతోందని తెలిపారు.
100 అడుగుల రోడ్డు నిర్మాణం..
హైదరాబాద్‌కు సంబంధించిన ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చర్లపల్లి రైల్వేటర్మినల్ కేంద్రం కానుంది. ఇలాంటి కీలకమైన రైల్వే టర్మినల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ట్రాక్‌లతోపాటుగా, స్టేషన్ నిర్మాణం, ప్రయాణికులకోసం వసతులు అన్నీ పూర్తికావొచ్చాయి. ఈ టర్మినల్ పూర్తవగానే.. ప్రత్యక్షంగా ప్రారంభోత్సవానికి హాజరై.. ప్రజలకు అంకితం చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా అంగీకరించారు. ఇలాంటి కీలకమైన రైల్వే టర్మినల్ చేరుకునేందుకు FCI గోడౌన్ వైపు నుంచి ప్రయాణీకుల రాకపోకల కోసం.. 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముంది. ఉత్తరం వైపు (భరత్‌నగర్) కూడా 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం అవుతుంది. దీంతోపాటుగా ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనిపై మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నానని అన్నారు.
అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈరైల్వే స్టేషన్..
అదే విధంగా, దక్షిణమధ్య రైల్వే కేంద్రస్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్న విషయం మీకు తెలిసిందే. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈరైల్వే స్టేషన్‌ను అంకితం చేసేందుకే ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే.. భాగంగా రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. రేతిఫైల్ బస్ స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉన్న కారణంగా.. పీక్ అవర్స్ లో రైల్వేస్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకొరకు, నిర్దేశించుకున్న సమయానికి అనుగుణంగా రైల్వేస్టేషన్ పనులు పూర్తయి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేనాటికి.. రోడ్డు విస్తరణ పూర్తయి ట్రాఫిక్ సమస్యలు తగ్గేందుకు వీలువుతుంది. అందుకే ఈ విషయంలోనూ మీరు చొరవతీసుకోగలరని కోరుతున్నాను. మీరు తీసుకునే ఈ చొరవ.. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న చర్యలకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు.
Read Also: Prakasam Barrage : బ్యారేజ్ బోట్లు ఢీకొట్టిన ఘటన..అదుపులోకి వైసీపీ నేతలు