Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!
Road Accident : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెపుతుంటే..రోజు ఎక్కడో ఓ చోట మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి అవుతున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్ల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే
- By Sudheer Published Date - 03:43 PM, Mon - 3 November 25
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని ప్రభుత్వాలు చెపుతుంటే..రోజు ఎక్కడో ఓ చోట మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురి అవుతున్నాయి. కొన్ని చోట్ల ఆర్టీసీ డ్రైవర్ల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే..మరికొన్ని చోట్ల ఎదురుగా వస్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఉదాహరణ. టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల బస్సుపై పడటంతో, ముందరి వరుసల్లో కూర్చున్న ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మన రోడ్ల భద్రతా ప్రమాణాలు, డ్రైవింగ్ సంస్కృతి, మరియు చట్టాల అమలుపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. రోడ్డు భద్రత అంటే కేవలం సిగ్నల్ లైట్లు, రూల్స్ మాత్రమే కాదు అవి అమలు చేయాలనే నిబద్ధత కూడా అవసరం. కానీ మన వ్యవస్థలో ఆ చైతన్యం కనిపించడం లేదు.
Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?
ఇటీవలి కాలంలో జరిగిన కర్నూలు బస్సు దుర్ఘటన కూడా ప్రజల్లో భయాన్ని కలిగించింది. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగిన ప్రమాదం 19 ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మన చట్టాల బలహీనతను, అమలులో ఉన్న నిర్లక్ష్యాన్ని మరోసారి చాటి చెప్పింది. తాగి వాహనాలు నడపకూడదని చట్టాలు ఉన్నా, వాటి అమలులో కఠినత లేదు. ఫైన్ వేసి వదిలేయడం ద్వారా ప్రభుత్వం “తాగి డ్రైవ్ చేయొచ్చు, జరిమానా కడితే చాలు” అనే తప్పుడు సందేశాన్ని ప్రజలకు ఇస్తోందనే చెప్పాలి. అంతే కాదు, బస్సుల్లో అదనపు ప్రయాణికులను ఎక్కించడం కూడా నిబంధనలకు విరుద్ధమైనదే. ఆర్టీసీ లాభాల కోసం ఆక్యుపెన్సీ పెంచాలనే ఆలోచన సహజమే కానీ, అది ప్రజల ప్రాణాలతో ఆటపట్టించే స్థాయికి వెళ్లకూడదు. ప్రమాదం సంభవించినప్పుడు కిక్కిరిసిన బస్సులో ప్రాణాలు రక్షించుకోవడం దాదాపు అసాధ్యం.
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
ఇక రోడ్ల పరిస్థితి కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రోడ్లు గుంటలు, వంపులు, ఎత్తుపల్లాలతో ఉండటమే కాకుండా, రాత్రివేళ వీధి లైట్లు వెలగకపోవడం కూడా పెద్ద సమస్య. స్పీడ్ బ్రేకర్ల ముందు హెచ్చరికలు ఉండవు, రెడ్ సిగ్నల్ దగ్గర చాలామంది వాహనాలు ఆపరు. అంటే, చట్టాలు ఉన్నా, వాటిని పాటించే సంస్కారం మన సమాజంలో ఇంకా పాతుకుపోలేదు. ప్రతి ప్రమాదం తర్వాత ప్రభుత్వాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తాయి, సంతాపం తెలుపుతాయి. కానీ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రజల్లోనూ, అధికారుల్లోనూ చట్టాలను గౌరవించే అలవాటు రాకపోతే, ఇలాంటి విషాదాలు మన జీవితాల్లో పునరావృతమవుతూనే ఉంటాయి. మారాల్సింది రోడ్లు కాదు, మన ఆలోచన విధానం రూల్స్‌ను పాటించడం జీవన భద్రతకు సమానం అనే అవగాహన ఏర్పడితేనే మనం నిజమైన రోడ్డు భద్రత వైపు అడుగులు వేస్తాం.