Nestle – Cerelac : పిల్లలకు సెరెలాక్ ఇస్తున్నారా ? అందులో చక్కెర మోతాదుపై సంచలన రిపోర్ట్
Nestle - Cerelac : మనదేశంలో నెస్లే కంపెనీ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఫుడ్ బ్రాండ్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉందని పబ్లిక్ ఐ పరిశోధనలో తేలింది.
- Author : Pasha
Date : 18-04-2024 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
Nestle – Cerelac : మనదేశంలో నెస్లే కంపెనీ ద్వారా అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు బేబీ ఫుడ్ బ్రాండ్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉందని పబ్లిక్ ఐ పరిశోధనలో తేలింది. ఇటువంటి ఉత్పత్తులు యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో చక్కెర రహితంగా ఉన్నాయని రీసెర్చ్‌లో వెల్లడైంది. నెస్లే కంపెనీ శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు చక్కెర, తేనెను జోడిస్తోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల పిల్లల్లో స్థూలకాయం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించాలనే లక్ష్యంతో రూపొందించిన అంతర్జాతీయ మార్గదర్శకాల ఉల్లంఘన జరుగుతోందని తెలిపింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో విక్రయించే నెస్లే ఉత్పత్తుల్లో ఈ ఉల్లంఘనలను గుర్తించామని నివేదిక స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join
భారతదేశంలో విక్రయించే మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రోడక్టులలో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు 3 గ్రాముల చక్కెర ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇథియోపియా, థాయ్‌లాండ్‌లలోనైతే ఈ తరహా ఉత్పత్తులలో చక్కెర మోతాదు మరీ అత్యధికంగా దాదాపు 6 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీ, బ్రిటన్‌లలో వీటిని చక్కెర లేకుండా విక్రయిస్తున్నారు. నెస్లే కంపెనీ మన దేశంలో 2022 సంవత్సరంలో దాదాపు రూ.20,000 కోట్లు విలువైన సెరెలాక్ ఉత్పత్తులను విక్రయించింది.
Also Read :Political Heirs : రాజకీయ వారసులతో ఎన్నికల ప్రయోగం.. ఏమవుతుందో ?
‘‘ఈ అధ్యయన నివేదికలో ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి. శిశువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారాలలో చక్కెరను జోడించడం సరికాదు. ఇది పిల్లలను చక్కెరకు అలవాటు చేస్తుంది. ఆరోగ్యానికి చేటు చేస్తుంది’’ అని బ్రెజిల్‌లోని పరైబా ఫెడరల్ యూనివర్సిటీ న్యూట్రిషన్ విభాగం ఎపిడెమియాలజిస్ట్ , ప్రొఫెసర్ రోడ్రిగో వియాన్నా తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లల ఆహారంలో చక్కెర అతిగా ఉంటే వారిని ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ముసురుకునే అవకాశాలు పెరుగుతాయి.
Also Read :Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
దీనిపై నెస్లే ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మేం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. శిశువులకు సంబంధించిన పోషకాహార ఉత్పత్తుల్లో జోడించే చక్కెర మోతాదును గత ఐదేళ్లలో 30 శాతం వరకు తగ్గించాం’’ అని స్పష్టం చేశారు.